గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం

గ్రేటర్ హైదరాబాద్ లో భారీ వర్షం

గ్రేటర్ హైదరాబాద్ లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు కాలనీలు పూర్తిగా నీటమునిగాయి. నాలాలు పొంగిపోర్లుతున్నాయి. ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ ఏర్పడింది. ఆఫీసులకు వెళ్లే వారు నానా పాట్లు పడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఘట్ కేసర్, అంబర్ పేటలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. 

తెలంగాణలో భారీ వర్షాలు.. 

ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్ కంటిన్యూ అవుతోంది.

నల్గొండ జిల్లాలోని తెల్ దేవరపల్లిలో అత్యధికంగా 6 సెంటీ మీటర్ల వర్షం పడగా... కరీంనగర్ జిల్లాలలో 5.4 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, మేడిపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లె, నిర్మల్ జిల్లా వాద్యాల్లో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. ముఖ్యంగా సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, యాదాద్రి, సూర్యాపేట, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.