
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చండ్రుగొండ మండల కేంద్రంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి నేషనల్ హైవే పక్కన ఉన్న ఎస్సీ ప్రభుత్వ బాలుర సంక్షేమ వసతి గృహంలోకి వరద నీరు చేరింది. డ్రైనేజీ సిస్టం సరిగా లేకపోవడంతో మురుగునీరు సైతం బాలుర వసతి గృహంలోకి మోకాళ్ల లోతు చేరింది. దీంతో వసతి గృహంలోని సుమారు 60 మంది విద్యార్థులు దుర్గంధం భరించలేక ఇబ్బందులు పడుతున్నారు.
తమ పుస్తకాలు, వస్తువులను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. అసలే సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో సంక్షేమ వసతి గృహంలోకి మురుగునీరు చేరడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రాష్ర్ట ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.