
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో శనివారం వర్షం దంచికొట్టింది.ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వాన పడింది. మధ్యాహ్నం 12 నుంచి 2.30 గంటల మధ్య 9.8 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. సెంట్రల్ ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో వీధులు, రోడ్లు, మార్కెట్ ఏరియాలు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. పలు చోట్ల మోకాళ్ల లోతు నీటిలో జనం నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ సీజన్ లో ఇది మొదటి భారీ వర్షం అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. శనివారానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఆదివారానికీ ఎల్లో అలర్ట్ ప్రకటించారు. మింటో బ్రిడ్జిని అధికారులు మూసేశారు. తిలక్ బ్రిడ్జి అండర్ పాస్‌లోనూ నీళ్లు నిలిచిపోయాయి. ఔటర్ రింగ్ రోడ్ జలమయం కావడంతో హైదర్‌పూర్- ముకుర్బా చౌక్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో ట్రాఫిక్ ను మళ్లించారు. ఇండియా గేట్‌ను కలిపే ప్రగతి మైదాన్ టన్నెల్ నీటిలో మునిగిపోయింది. గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రగతి మైదాన్, అక్బర్ రోడ్, తిలక్ రోడ్, ద్వారక, మయూర్ విహార్, ఛతక్ పురి, యమునా నగర్, కురుక్షేత్ర, కర్నాల్, అసంద్, పానిపట్, ఖార్ఖోడ, భివాని, జాజ్జర్, సొహానా తదితర ప్రాంతాల్లో కుండపోత కురిసింది.
ఇదేనా స్మార్ట్ సిటీ?: వ్యాపారుల ఫైర్
ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా కస్టమర్లు ఎవరూ రాకపోవడంతో తమ వ్యాపారం దెబ్బతిన్నదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ సీజన్ లో ఇలాగే జరుగుతున్నదని తెలిపారు. నేతలు స్మార్ట్ సిటీ అంటూ ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వడం, ఆ తర్వాత మరిచిపోవడం అలవాటైందని న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అతుల్ భార్గవ మండిపడ్డారు.
రెండో రోజూ అమర్ నాథ్ యాత్రకు ఆటంకం
ప్రతికూల వాతావరణం కారణంగా అమర్ నాథ్ యాత్రకు రెండో రోజు కూడా ఆటంకం కలిగింది. శనివారం కాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అమర్ నాథ్ యాత్రీకులు రాకపోకలు సాగించడానికి ఇబ్బంది కలిగింది. దీంతో పహల్గామ్, బాల్టాల్ రూట్లలో యాత్రను సస్పెండ్ చేశారు. భక్తులను ముందుకు వెళ్లనివ్వట్లేదని అధికారులు తెలిపారు. కాగా, బాల్టాల్-– పహల్గామ్ మార్గంలో ఇరుక్కున్న భక్తులు తమను తరలించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.