
ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన వడ్లు పూర్తిగా నీటమునిగాయి. మండలంలోని గోగుపల్లి శివారులోని కొనుగోలు కేంద్రంలో సుమారు 150 మంది రైతులు తమ వడ్లను ఆరబోశారు. బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తోడు కొనుగోలు కేంద్రానికి సమీపంలో ఉన్న ఊరవాగు ఉప్పొంగడంతో వడ్లు మొత్తం నీటిలో కొట్టుకుపోయాయి.
వడ్లు లోడింగ్‌కు సిద్ధంగా ఉన్నప్పటికీ.. క్వింటాల్‌కు 10 కిలోలు తరుగు తీయాలని మిల్లర్లు చెప్పడంతో వడ్లను కేంద్రంలోనే ఉంచామని, వర్షం, వరద వల్ల మొత్తం బస్తాలు తడిసిపోయాయని కన్నీటిపర్యంతమయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ఘటనాస్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.
పంట నష్ట పరిహారం ఎంతైనా నేరుగా రైతుల అకౌంట్లలోనే జమ చేస్తుందన్నారు. ఆమె వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, కాంగ్రెస్ లీడర్లు ఇర్సవడ్ల వెంకన్న, రఘు, అప్సర్, చెన్నూరి బాలరాజు పాల్గొన్నారు. అలాగే తడిసిన వడ్లను జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు తుమ్మ వెంకట్‌రెడ్డి పరిశీలించి, రైతులను పరామర్శించారు.