మాడ్గల్ మండలంలో గాలివాన బీభత్సం .. పిడుగుపాటుతో పశువులు మృతి

మాడ్గల్  మండలంలో గాలివాన బీభత్సం .. పిడుగుపాటుతో పశువులు మృతి

ఆమనగల్లు/ఉప్పునుంతల/అచ్చంపేట, వెలుగు: మాడ్గల్  మండలంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. గాలివానకు మాడుగుల నుంచి కలకొండకు వెళ్లే ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగి ధాన్యం రాలిపోయి నష్టం వాటిలినట్లు రైతులు తెలిపారు. గాలివానతో ఉప్పునుంతల మండలం మర్రిపల్లి గ్రామంలో 300 ఏండ్ల నాటి మర్రి వృక్షం విరిగిపోయింది. 

పిడుగుపాటుతో దాసర్లపల్లి గ్రామానికి చెందిన కుందేటి హుస్సేన్ కు చెందిన ఆవు చనిపోయింది. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలో పిడుగు పడి 25 గొర్రెలు చనిపోయాయి. గొర్రెలు చనిపోవడంతో రెండున్నర లక్షల నష్టం వాటిల్లిందని బాధితుడు సాయిలు తెలిపాడు. బల్మూరు మండలం గట్టు తుమ్మెన్  గ్రామానికి చెందిన చెనమోని కృష్ణయ్యకు చెందిన ఆవు, దూడ పిడుగుపాటుతో చనిపోయాయి.