శంషాబాద్ లో భారీ వర్షం.. నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్

శంషాబాద్ లో భారీ వర్షం.. నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్

శంషాబాద్ మండల పరిధిలో బుధవారం భారీ వర్షం కురిసింది. భారీగా వరద నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. పెద్ద గొల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్ లలో నీరు ప్రవేశించడంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రహదారి పూర్తిగా మూసివేయడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద గోల్కొండ నుంచి గొల్లపల్లి, చిన్న గోల్కొండ, శంషాబాద్, మహేశ్వరం ప్రాంతాలకు వెళ్లే రహదారులను అధికారులు మూసివేశారు. టోల్ బూత్ లలోకి నీరు చేరడంతో పెద్ద గోల్కొండ నుండి శంషాబాద్, శంషాబాద్ నుండి తుక్కుగూడ వెళ్లే టోల్ బూత్ లను ఔటర్ రింగ్ రోడ్డు అధికారులు మూసివేశారు. 

చెరువు శిఖం పొలాలు కబ్జా...
బైరామల్ చెరువు శిఖం పొలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారని స్ధానికులు వెల్లడించారు. ప్లాట్లు చేయడంతో ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 15 వద్ద వరద నీరు వచ్చి చేరిందన్నారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమీపంలో ఉన్న గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే వరద నీరు స్టోరేజ్ అయ్యిందన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని  కోరారు.

ఆవర్తన ప్రభావం...
మరోవైపు...ఆవర్తన ప్రభావంతో హైదరాబాద్ సహా పలు జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి రోడ్లపైకి వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మీర్ పేట్, దిల్ సుఖ్ నగర్, కొత్తపేట, మలక్ పేట్ వర్షం పడింది. అంబర్ పేట్, నాంపల్లి, లక్డీకాపూల్ మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు రాష్ట్రానికి వాతావరణశాఖ రెండు రోజుల రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.