తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు.. జనజీవనం అస్తవ్యస్తం

తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు..  జనజీవనం అస్తవ్యస్తం

తమిళనాడును మరోసారి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.  ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరదలు ముంచెత్తుతున్నాయి. కడలూరు, కోయంబత్తూరు, తంజావూరు, కాంచీపురం, దిండిగల్‌, కన్యాకుమారి సహా 18 జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తం అయింది.  ఇక రాష్ట్ర రాజధాని చెన్నైలో అయితే రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి.   దీంతో  కడలూరు, విల్లుపురం, మైలాడుతురై, నాగపట్నం, వెల్లూరు, రాణిపేట్, తిరువణ్ణామలై, తిరువారూర్, కళ్లకురిచ్చి, చెంగల్‎పట్టు జిల్లాల్లో జనవరి 8  సోమవారం రోజున  స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.  

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో పాటు ఈశాన్య గాలుల ప్రభావం తమిళనాడులో కురుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.  ఈ భారీ వర్షాలు మరో వారం రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  లోతట్టు ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని,  మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.  రాష్ట్రంలోని పది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. గత ఏడాది తమిళనాడులో తీవ్ర వర్షపాతం నమోదైంది, ప్రధానంగా మైచాంగ్ తుఫాను చెన్నైని తాకడంతో  కోట్లాది ఆస్తి నష్టం వాటిల్లింది.