ఉల్వనూరులో భారీ వర్షం..ఇండ్ల లోకి వరద నీరు

ఉల్వనూరులో భారీ వర్షం..ఇండ్ల లోకి వరద నీరు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం ఉల్వనూరు లో భారీ వర్షం కురిసింది. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గాలేకపోవడంతో వరదనీరు ఇళ్లలోకి చేరుతోంది. వరదతో పాటు విష సర్పాలు కూడా వస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే వరద ఇండ్లలోకి చేరుతుందని చెబుతున్నారు. రాత్రి సమయంలో వాన పడితే కంటిమీద కునుకు ఉండదని తెలిపారు. ప్రతి ఏటా వానాకాలంలో ఇదే పరిస్థితి అని...చిన్న పిల్లలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని కోరుతున్నారు.