భారీ వర్షాలతో ఢిల్లీ రోడ్లు జలమయం

భారీ వర్షాలతో ఢిల్లీ రోడ్లు జలమయం

ఢిల్లీలో గత రెండ్రోజులుగా భారీగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల వల్ల ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ అవ్వడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయం అవడంతో.. ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇఫ్కో చౌక్, శంకర్ చౌక్, రాజీవ్ చౌక్, గురుగ్రామ్–ఢిల్లీ ఎక్స్ ప్రెస్ హైవే సరిహద్దుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నోయిడా, గురుగ్రామ్ ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

మరోవైపు హర్యానాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. రహదారులపై భారీగా వరద ప్రవహిస్తోంది. దీంతో గురుగ్రామ్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనాలన్నీ... సగం వరకు వరదలో మునిగిపోయాయి. రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద వల్ల ట్రాఫిక్ నియంత్రించడం కష్టమవుతుందని గురుగ్రామ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ తెలిపింది. 

ట్రాఫిక్ జామ్ అవ్వకుండా వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని.. గురుగ్రావ్ లోని ఆఫీసులకు సూచించింది. మరోవైపు ఇవాళ అన్ని విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ గురు గ్రామ్ కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలకు హర్యానాలోని నర్సింగాపూర్ లో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. మోకాలి లోతు నీటిలోనే ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. పార్క్ చేసిన వాహనాలన్నీ వరద దాటికి కొట్టుకుపోయాయి.