ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

నైరుతి సీజన్ మొదలైన తర్వాత మొదటి సారిగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి మొదలైన వర్షం ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో ముంబై వ్యాప్తంగా రవాణా వ్యవస్థ తో పాటు.. సేవలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు రైళ్లు ఆలస్యంగా నడవడంతో పాటు.. అనేక విమాన సర్వీసులు రద్దు చేశారు. మరికొన్ని విమానాల షెడ్యూల్ ను సవరించారు.

ప్రధాన రోడ్లపై మోకాలి లోతున నీళ్లు ప్రవహిస్తుండడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ను మళ్లించారు. నగరంలోనే కాకుండా, శివారుప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల రోడ్ల పక్కన ఉన్న చెట్టు కొమ్మలు విరిగి వాహనాలపై పడ్డాయి. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రేపటి వరకు ఇదే విధంగా వర్షపాతం ఉంటుందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.