ముంబైని ముంచెత్తిన వాన.. చెరువుల్లా మారిన రోడ్లు

ముంబైని ముంచెత్తిన వాన.. చెరువుల్లా మారిన రోడ్లు

ముంబైని భారీ వర్షం ముంచెత్తుతోంది. నిన్నటి నుంచి నగరంలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. భారీ వర్షంతో రోడ్లు, కాలనీలు చెరువుల్లా మారాయి. బాంద్రా, సియాన్, కళా నగర్, గాంధీ మార్కెట్ ఏరియాల్లో వర్షం దంచికొడుతోంది. రైలు పట్టాలు మునిగి పోవడంతో లోకల్ ట్రైన్లను ఆపేశారు. చాలా ప్రాంతాల్లో 5కిపైగా సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. కొలాబా ఆరున్నర సెంటీమీటర్లు.. శాంతాక్రజ్ లో ఐదు సెంటీమీటర్ల వాన పడింది. రెండురోజులుగా.. సౌత్ ముంబై భారీవర్షంలో తడిసి ముద్దవుతోంది. చించోలీ, బోరివాలీ, దహిసార్ ఏరియాల్లో 6 సెంటీమీటర్ల రెయిన్ ఫాల్ నమోదైంది. ముంబైలోని చాలా ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపై నిలిచిపోయింది. భారీ వర్షం ముంచెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబైలో వానలు కురుస్తున్నాయి. ఈసారి మహారాష్ట్రలోకి ముందుగానే ఎంట్రీ ఇచ్చింది మాన్ సూన్. ఏటా జూన్ 10న రాష్ట్రంలోకి వచ్చే రుతుపవనాలు ఒకరోజు ముందుగానే వచ్చాయి. వారం పాటు ముంబైకి భారీ వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేశారు. మహారాష్ట్రలోని పలు నగరాలకు రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన చేశారు. ముంబై, రాయ్ గఢ్, థానే, పాల్గర్, పుణె, నాసిక్ సహా.. మరఠ్వాడా, సెంట్రల్ మహారాష్ట్రలోని పలు నగరాల్లో హెవీ రెయిన్ ఉంటుందని అలర్ట్ చేశారు.