రాత్రంతా వాన.. కొట్టుకుపోయిన కార్లు.. హైవే బ్లాక్

రాత్రంతా వాన.. కొట్టుకుపోయిన కార్లు.. హైవే బ్లాక్

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో వరద ముంచెత్తింది. అదివారం రాత్రంతా కుండపోతగా పడిన వర్షాలకు నదులు ఉప్పొంగాయి. కాంగ్రా, ధర్మశాల, సిమ్లా సహా అనేక ప్రాంతాలు వరద ప్రభావంతో అతలాకుతలం అయ్యాయి. కాంగ్రా జిల్లాలో ఇండ్లలోకి వరద నీరు చేరింది. వరదలో కార్లు తేలుతూ కనిపించాయి. కొన్ని చోట్ల నీటి వేగానికి కార్లు కొట్టుకుని పోయాయి. ధర్మశాల సమీపంలోని భగ్సూ నాగ్ ప్రాంతంలో మాంఝీ నది ఒక్కసారిగా ఉప్పొంగింది. రక్కర్ గ్రామంలో రోడ్లు నదులను తలపించాయి. ధర్మశాలలో కొండవాలులో ఉన్న దాదాపు 10 షాపులకు పైగా పూర్తిగా ధ్వంసమయ్యాయి. సిమ్లా జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఝక్రీ ప్రాంతంలో నేషనల్ హైవే బ్లాక్ అయింది. అలాగే ఉత్తరాఖండ్, జమ్ము కాశ్మీర్‌‌లలోనూ భారీ వర్షాలతో జన జీవనం స్తంభించింది. ఉత్తరాఖండ్‌లోని చమోలి ప్రాంతంలో  రిషికేష్ –  బద్రినాథ్ నేషనల్ హైవేపై కొండలు పడి రోడ్డు ధ్వంసమైంది. దీంతో ఆ రూట్‌లో రాకపోకలు నిలిచిపోయాయి.


ఆరెంజ్ వార్నింగ్
హిమాచల్‌ ప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆదివారమే ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. జులై 12, 13 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ వార్నింగ్ ఇష్యూ చేసింది. 14, 15 తేదీల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. ఈ నాలుగు రోజుల్లో లోకల్స్ కానీ, టూరిస్టులు కానీ నదీ ప్రాంతాల్లో తిరగొద్దని, సడన్‌గా వరద ముంచుకురావడం, కొండ చరియలు విరిగిపడడం లాంటి జరిగే ప్రమాదం ఉందని సిమ్లా వాతావరణ కేంద్రం డైరెక్టర్ మన్మోహన్ సింగ్ వెల్లడించారు.