ముంబైని వదలని వాన.. చెరువులుగా మారిన రోడ్లు

ముంబైని వదలని వాన.. చెరువులుగా మారిన రోడ్లు

ముంబై మునిగిపోతోంది. రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న నగరంలోని చాలా ప్రాంతాలు జలమలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 18 సెంటిమీటర్ల వర్షం పడింది. చాలా ప్రాంతాల్లో 15 సెంటిమీటర్ల వాన కురిసింది. గాంధీ మార్కెట్, సైన్ ఏరియాను వరద ముంచెత్తింది. మతుంగా, పతాలిపడ, శాంతా క్రజ్ , వసాయి, బాదల్ పూర్, అంబర్ నాథ్, కల్యాణ్ , కుర్లా, థానే ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. 2005 నాటి  వరద పరిస్థితులు వచ్చేలా కనిపిస్తున్నాయి. 2005 జూలై 26న 24 గంటల్లోనే ముంబైలో 94 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఇవాళ కూడా కుండపోత వాన కురిసే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికలతో.. ముంబై వాసులు భయంతో వణికిపోతున్నారు.

వరద నీటితో ముంబైలోని రోడ్లన్ని చెరువులుగా మారాయి. రవాణాకు తీవ్ర అంతరాయం కల్గుతోంది. ప్రధాన రోడ్లలో భారీగా ట్రాఫిక్ జామైంది. వరద పోటెత్తడంతో కుర్లా- థానే మార్గంలో నడిచే పలు రైళ్లను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేశారు సెంట్రల్ రైల్వే అధికారులు. 7 విమాన సర్వీసులను క్యాన్సిల్ చేశారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించింది బీఎంసీ. వరద బీభత్సం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

మహారాష్ట్రలోని రాయ్ గఢ్, రత్నగిరి, సింధూదుర్గ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరువుతో అల్లాడుతున్న మరట్వాడా, నాందేడ్ ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో బాదల్ పూర్ , వాంగని మధ్య 2 వేల మంది ప్రయాణికులతో వెళుతున్న మహాలక్ష్మి ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేశారు. సెంట్రల్ రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికులకు బిస్కెట్లు ఇచ్చారు. ప్రయాణికులను తరలించేందుకు మూడు బోట్లు ఏర్పాటు చేశారు అధికారులు.