రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు.. ఇవాళ (జులై 24) ఈ జిల్లాల్లో కుండపోత.. ఆరెంజ్ అలర్ట్ జారీ

రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు.. ఇవాళ (జులై 24) ఈ జిల్లాల్లో కుండపోత.. ఆరెంజ్ అలర్ట్ జారీ
  • రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
  • ములుగులో 25.5 సెం.మీ. వర్షపాతం నమోదు
  • భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాల్లోనూ దంచికొట్టిన వాన
  • సూర్యాపేట, మంచిర్యాల, కరీంనగర్​లో అతిభారీ వర్షాలు
  • హైదరాబాద్ సహా అన్ని సిటీల్లో రోజంతా ముసురు  
  • రాష్ట్రమంతటా నేడు భారీ వానలు.. ములుగు, భూపాలపల్లి
  • జిల్లాల్లో అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్​ జారీ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వర్షాలు జోరందుకున్నాయి. అన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తాంధ్ర తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ అంతటా ముసురేసింది. అన్ని జిల్లాల్లో మంగళవారం మొదలైన ముసురు బుధవారం (జులై 23) కూడా కొనసాగింది. ముఖ్యంగా మంగళవారం రాత్రి రాష్ట్రాన్ని మబ్బులు కమ్మేయగా.. కరీంనగర్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. 

ములుగు జిల్లాలో అత్యధిక వర్షపాతం రికార్డయింది. అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షానికి కరీం నగర్​ సిటీలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయా జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా జిల్లాల్లో రాకపోకలు ఆగిపోయి జనజీవనం స్తంభించింది. 

ములుగు జిల్లా అస్తవ్యస్తం 

మంగళవారం (జులై 22) రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో ములుగు జిల్లా అతలాకుతలమైంది. బుధవారం ఉదయం 8.30 వరకే ములుగు జిల్లా వెంకటాపురంలో 25.5 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా ఏటూరు నాగారంలో 18.5, మంగపేటలో 15.9, ఆలుబాకలో 14.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. 

బుధవారం ఉదయం నుంచి కూడా అత్యంత భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం 8.30 నుంచి రాత్రి వరకు అక్కడ 21.5 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో 23.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 12 సెం.మీ, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా రవీంద్ర నగర్​లో 10.7, ములుగు జిల్లా ఏటూరు నాగారంలో 10.5, ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 10.2, ములుగు జిల్లా ఆలుబాకలో 10.1, కరీంనగర్​లో 9.3, గంగిపల్లిలో 7.5, భద్రాద్రి జిల్లా మణుగూరులో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. 

ఆయా జిల్లాల్లో ఇదీ పరిస్థితి.. 

 ఆసిఫాబాద్ జిల్లా సుస్మీర్, సోమిని, కుష్నపల్లి, నాయికపుగూడ వాగులు ఉప్పొంగి 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతలమానేపల్లి మండలంలో దిందా వాగు, ఆసిఫాబాద్ మండలం గుండి పెద్ద వాగు, కెరమెరి మండలం లక్మాపూర్, అనార్ పెల్లి పెద్ద వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కౌటాల తహసీల్దార్ ఆఫీస్ నీట మునిగింది.  
    
కరీంనగర్ సిటీలో మెయిన్ రోడ్లతోపాటు అనేక కాలనీల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం వరద నీటితో పరవళ్లు తొక్కుతోంది. 
    
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రామలక్ష్మణపల్లె, పదిర గ్రామాల మధ్య మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కోనరావుపేట మండలం మామిడిపల్లి వద్ద మూల వాగుపై లో లెవెల్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో మామిడిపల్లి, నిజామాబాద్ గ్రామాలకు రవాణా స్తంభించింది. కోనరావుపేట మండల శివారులోని లో లెవెల్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. 
    
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని దూప్ సింగ్ తండాకు వెళ్లే దారిలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు బంద్​ అయ్యాయి.  
    
మహబూబాబాద్ వద్ద మున్నేరు వాగుపై చెక్ డ్యామ్ మీదుగా వరద ఉధృతంగా ప్రవహిస్తున్నది. కొత్తగూడ మండలంలో గాదె వాగు, ముస్మీ, కత్తెర్ల వాగులు ఉప్పొంగడంతో మొండ్రాయి గూడెం, గుండాల, ఆదిలక్ష్మీపురం తిమ్మాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల, రాంపూర్ వద్ద మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాంపురం, మద్దివంచ, గుండ్రాతి మడుగు, కొత్తతండా గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. జిల్లాలోని పలు చెరువులు మత్తడి పోస్తున్నాయి. కొత్తగూడ మండలంలో రాళ్ల తిట్టె వాగు వద్ద చేపల వేటకు వెళ్ళిన ఓ యువకుడు గల్లంతయ్యాడు.  

 మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ లో భారీ వర్షానికి ఎర్ర వాగు ఉప్పొంగింది. పత్తి చేనుకు వెళ్లి తిరిగి వస్తుండగా వాగులో వరద ధాటికి ట్రాక్టర్ కొట్టుకుపోగా..  రైతులు తప్పించుకుని క్షేమంగా బయటకు వచ్చారు.  

 ఖమ్మంలో మున్నేరు వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం ఏరియాల్లోని సింగరేణి ఓపెన్ కాస్టు బొగ్గు గనుల్లో 70 వేల టన్నులకు పైగా ప్రొడక్షన్ ఆగింది. బూర్గంపహడ్​ మండలం పాత పినపాక సమీపంలోని సీతారామ ప్రాజెక్ట్ కాలువలో ఈతకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. జిల్లాలోని పలు ఏజెన్సీ గ్రామాల్లో వాగులు ఉప్పొంగడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పినపాక, మణుగూరులో పంట పొలాలు నీట మునిగాయి.  

హైదరాబాద్​లో పొద్దంతా ముసురు..

హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. తర్వాత రాత్రి నుంచి ముసురు పట్టింది. బుధవారం మధ్యాహ్నం 3 వరకూ ముసురు కమ్మేసింది. మంగళవారం రాత్రంతా వర్షం పడడంతో సిటీలోని పలు ప్రాంతాలు జలమయమ య్యాయి. ఆఫీసులకు వెళ్లే సమయంలో ట్రాఫిక్​ జామ్​లతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కూకట్​పల్లి, గచ్చిబౌలి, హైటెక్​సిటీ, మలక్​పేట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అలాగే రాష్ట్రంలోని ఇతర సిటీల్లోనూ రోజంతా ముసురు పట్టింది. 

నేడూ అతిభారీ వర్షాలే..

ములుగు, జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలను వాతావరణ శాఖ ఇంకా హై అలర్ట్​లోనే పెట్టింది. ఆ రెండు జిల్లాల్లో గురువారం కూడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే, పరిస్థితులను బట్టి అది రెడ్ అలర్ట్​ కిందకూ మారే అవకాశాలూ లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు గురువారానికిగాను ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మిగతా జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.  అలాగే శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్​లో నాలుగు రోజుల పాటూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.   

మంగళవారం అర్ధరాత్రి 
కురిసిన భారీ వర్షం వివరాలు..
జిల్లా    ప్రాంతం    వర్షపాతం 

        (సెం.మీ.)
ములుగు     వెంకటాపురం    25.5
ములుగు    ఏటూరునాగారం    18.5
ములుగు    మంగపేట    15.9
ములుగు    ఆలుబాక    15
హనుమకొండ    భీమదేవరపల్లి    14.4
భద్రాద్రి     మణుగూరు (జీఎం)    12.9
ములుగు    గోవిందరావుపేట    12.3
భద్రాద్రి    మణుగూరు    11.6
సూర్యాపేట    మామిళ్లగూడెం    11.6
జయశంకర్​    టేకుమట్ల    10.3
భద్రాద్రి    కరకగూడెం    10.2
వరంగల్​    కల్లెడ    10
ఖమ్మం    మధిర    9.9
జయశంకర్​    చిట్యాల    9.7
రాజన్న సిరిసిల్ల    పెద్దలింగాపురం    9.7