హైద‌రాబాద్ సిటీలో ముసురు.. భారీ వ‌ర్షంతో చీక‌ట్లు.. ఎల్లో అల‌ర్ట్

హైద‌రాబాద్ సిటీలో ముసురు.. భారీ వ‌ర్షంతో చీక‌ట్లు.. ఎల్లో అల‌ర్ట్
  • అత్యధికంగా మియాపూర్​లో 5.1 సెం.మీల వర్షపాతం
  • ఇయ్యాల ఎల్లో అలర్ట్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ సిటీలో సోమవారం సైతం ముసురు కొనసాగింది. తెల్లవారుజాము నుంచి అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ పడింది. రోడ్లపై నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు ఇబ్బందిపడ్డారు. సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఉప్పల్  ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రమైంది. వర్షం కారణంగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గత రెండ్రోజులుగా హెల్ప్ లైన్ నంబర్ కు 200 లకిపైగా ఫిర్యాదులు రాగా..  సోమవారం ఒక్కరోజులో బల్దియా ఈవీడీఎం(ఎన్ ఫోర్స్ మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ )కి 39 ఫిర్యాదులు అందాయని అధికారులు తెలిపారు. 

కాలనీల్లో వర్షపు నీరు చేరిందని, చెట్లు విరిగిపడ్డాయని, మ్యాన్ హోల్స్ పొంగాయని, ఇతర సమస్యలపై సిటిజన్లు బల్దియాకి కాల్ చేస్తున్నారు. ఏదైనా అత్యవసరమైతే  హెల్ప్ లైన్ నం. 040–-21111111 సంప్రదించాలని, డీఆర్ఎఫ్​ బృందాల సాయం కోసం 9000113667 నంబర్ కు కాల్ చేయాలని ఈవీడీఎం అధికారులు తెలిపారు. మంగళవారం భారీ వాన పడే చాన్స్ ఉన్నందున హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు సిటీకి ఎల్లో అలర్ట్(6.4 నుంచి 11.5 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం) జారీ చేశారు. రెండ్రోజులుగా సిటీలో వానలు పడుతున్నా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్ స్పందించడం లేదు. కనీసం సిటిజన్లు అలర్ట్ గా ఉండాలనే ఆదేశాలు సైతం జారీ చేయలేదు. 

నార్సింగి ఓఆర్ఆర్ పై ఒకదానికొకటి ఢీకొన్న ఆరు కార్లు

సోమవారం ఉదయం కురిసిన వానకు నార్సింగి ఓఆర్ఆర్ పై వర్షపు నీరు చేరింది. పటాన్ చెరు నుంచి శంషాబాద్ వైపు వస్తున్న ఓ కారు నార్సింగి ఓఆర్ఆర్ పై ఓవర్ స్పీడ్ గా వెళ్లడంతో వెనక వచ్చే కారుపై వాన నీళ్లు పడ్డాయి.  దీంతో ఆ కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు.  ఇలా ఒకదాని వెనకాల ఒకటి 6 కార్లు ఢీకొన్నాయి. కార్లలోని వారికి స్వల్ప గాయాలయ్యాయి. అన్ని కార్లను పోలీసులు నార్సింగి పీఎస్ కు తరలించారు.