
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు వర్సిటీల పరిధిలో సోమవారం జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 2న నిర్వహించనున్న పరీక్షలను వాయిదా వేశామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తెలిపారు. 3 నుంచి జరిగే పరీక్షలన్నీ యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఓ ప్రకటనలో ఆయన చెప్పారు. అయితే 2న వాయిదా పడిన పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
అలాగే, జేఎన్టీయూ పరిధిలో సోమవారం జరగాల్సిన పరీక్షలను కూడా వాయిదా వేశారు. బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ 18, 16, 15, 13, - బీఫార్మసీ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ 17, 15, 13 సప్లిమెంటరీ, ఎంబీఏ ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ ఆర్ 22, 19 సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను ఈ నెల 5న నిర్వహిస్తామని రిజిస్టార్ వెంకటేశ్వర్లు తెలిపారు. 3వ తేదీ నుంచి జరిగే పరీక్షలు యథాతధంగాఉంటాయన్నారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగే పరీక్షలన్నీ వాయిదా వేశామని వర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరితెలిపారు.