
- ములుగు జిల్లా వెంకటాపురంలో కుండపోత వాన
- 30 గంటల్లోనే 46 సెం.మీ వర్షపాతం నమోదు
- నిలిచిపోయిన ములుగు-భద్రాచలం జిల్లాల మధ్య రాకపోకలు
- మంగపేటలో నీట మునిగిన 30 ఇండ్లు
- లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి సీతక్క
జయశంకర్ భూపాలపల్లి/ వెంకటాపురం/ములుగు/ మహబూబాబాద్, వెలుగు: ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దీంతో ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 30 గంటల్లోనే రికార్డుస్థాయిలో 46 సెం.మీ వర్షం కురిసింది. మంగపేట, ఏటూరునాగారం, గోవిందరావుపేట మండలాలలో సైతం 20 సెం.మీ పైగా వాన పడింది. మంగపేట మండలంలో మల్లూరు అత్తచెరువు తూము లీకేజీతో 30 ఇండ్లు నీట మునిగాయి. వెంకటాపురం మండలం యాకన్నగూడెం వద్ద వాగు ఉధృతికి రాళ్లవాగుపై వేసిన తాత్కాలిక రోడ్డు తెగడంతో భద్రాచలం–ములుగు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచపోయాయి.
భద్రాచలం వైపు వెళ్లేవారిని ఏటూరునాగారం– మణుగూరు మీదుగా పంపిస్తున్నారు. బోగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకుల అనుమతిని నిలిపివేశారు. మంగపేట మండలం రమణక్కపేటకి చెందిన సాధనపల్లి సారమ్మ ఇల్లు వర్షానికి తడిసి కూలి పోయింది. ములుగు జిల్లాలో 1,088 మిల్లీమీటర్లు, భూపాలపల్లి జిల్లాలో 558 మి.మీ, మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో 103.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లుగా ఆఫీసర్లు తెలిపారు. వెంకటాపురం, మల్లాపురం గ్రామాల మధ్య నిర్మిస్తున్న వంతెన వరదనీటితో మునిగిపోగా మల్లాపురం, రాచపల్లి, కర్రివాని గుంపు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మహబూబాబాద్ జిల్లాలోని మున్నేరు వాగు, పాకల వాగులు, కొత్తగూడ మండలంలోని గాదెవాగు, గుంజేడు తోపు, బూర్కపల్లి వాగు, కొత్తపల్లి, ముస్మీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
మొండ్రాయి గూడెం, గుండాల, ఆదిలక్ష్మీపురం తిమ్మాపూర్గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గార్ల_ రాంపూర్ వద్ద మున్నేరు వాగు రోడ్డు పై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో రాంపురం, మద్దివంచ, గుండ్రాతి మడుగు, కొత్తతండా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గూడురులోని భీముని పాదం, బయ్యారంలోని జలధార జలపాతలు వద్ద సందడి నెలకుంది. కాగా, గార్ల సమీపంలో మున్నేరు వాగు వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తామని గత పాలకులు శిలాఫలకాలు వేశారే కానీ పనులు చేపట్టలేదని వామపక్ష నాయకులు నిరసన చేపట్టారు. వెంటనే పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి..
ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. బుధవారం ములుగు జిల్లాలోని గుండ్ల వాగు, జలగలంచవాగులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. నీట మునిగిన ఇళ్లల్లోని ప్రజలను ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. గోదావరి ముంపు ప్రాంతాల్లోని ప్రజల సౌకర్యార్థం పునరావాస కేంద్రాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆఫీసర్లను ఆదేశించారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ములుగు, భూపాలపల్లి జిల్లాల ఆఫీసర్లు అప్రమత్తమయ్యారు. కలెక్టర్లు, ఎస్పీలు సంబంధిత శాఖల ఆఫీసర్లతో రివ్యూలు నిర్వహించారు. గోదావరి తీరంలో ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. డిస్టిక్ట్ డిసాస్టర్ రెస్పాన్ ఫోర్స్‌ను (డీడీఆర్‌ఎఫ్) రెడీ చేశారు. భూపాలపల్లి కలెక్టరేట్‌లో 9030632608, ములుగు కలెక్టరేట్ లో 18004257109 టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశారు.