తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

తమిళనాడులో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు

చెన్నై : తమిళనాడును భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కోస్టల్​ఏరియాతోపాటు పలు జిల్లాల్లో మంగళవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు అధికారులు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం హెచ్చరించింది. ఆ ప్రభావంతో పుదుచ్చేరి, కారైకాల్ తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు అరియలూరు, తంజావూరు, విల్లుపురం, తిరువణ్ణామలై, నాగపట్నం, తిరువారూర్, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరిలోనూ జనజీవనం స్తంభించింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

వర్షాలు తగ్గేవరకు పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు మూసివేస్తున్నట్లు పుదుచ్చేరి హోంమంత్రి నమశ్శివాయం తెలిపారు. పుదుచ్చేరిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. తమిళనాడులోని 35 జిల్లాల్లో మంగళవారం13.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నాగపట్నంలో అత్యధికంగా 11.3 మి.మీ వర్షపాతం రికార్డు అయింది.

మత్స్యకారులు రెండుమూడు రోజుల పాటు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని పుదుచ్చేరి మత్స్యశాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. రానున్న రెండు రోజుల్లో కోస్టల్​ప్రాంతాలు సహా  ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.