- వాతావరణ శాఖ వెల్లడి
- ఆదివారం పలుచోట్ల కుండపోత
- అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 12 సెం.మీ.
- హైదరాబాద్‌లోని పలు కాలనీలు జలమయం
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని పలుచోట్ల వర్షం కుండపోతగా కురిసింది.. సద్దుల బతుకమ్మ కోసం సిద్ధమవుతున్న టైంలో ఈదురుగాలులతో వర్షం ముంచెత్తింది. దీంతో పలు చోట్ల బతుకమ్మ వేడుకలకు అంతరాయం కలిగింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదలలో 12సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరో పదిచోట్ల భారీ వర్షాలు కురవగా, 137 చోట్ల మోస్తరు వానలు, 235చోట్ల తేలికపాటి, 139 ప్రాంతాల్లో అతితేలికపాటి జల్లులు కురిశాయి. దక్షిణ చత్తీస్‌గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు తెలంగాణ, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని అధికారులు చెప్పారు.
లోతట్టు ప్రాంతాలు జలమయం
భారీ వర్షానికి భాగ్యనగరం మరోసారి స్తంభించింది. మధ్యాహ్నం కురిసిన వర్షానికి వివిధ ప్రాంతల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. అంబర్‌పేట్, చే నెంబర్ వద్ద భారీగా నీరు నిలిచింది. కూకట్‌పల్లి, అల్విన్ కాలనీలు నీటితో నిండిపోయాయి. గాజుల రామారం, కుత్బుల్లాపూర్, ఉషోదయ కాలనీ పార్క్తదితర ప్రాంతాల్లో ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. గాజుల రామారంలో రోడ్డు నీట మునిగింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జీడిమెట్లలోని నారాయణ హాస్పిటల్లోకి వర్షపు నీరు చేరింది. జీహెచ్‌ఎంసీ ఎమర్జెన్సీ, డీఆర్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. టాంక్ బండ్ బతుకమ్మ ఘాట్ వద్ద భారీగా నీరు చేరడంతో మోటార్ల సాయంతో తొలగించాయి.
ఈదురుగాలులు, పిడుగులు
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వానలు దంచికొట్టాయి. అకస్మాత్తు వర్షాలతో బతుకమ్మ అడుతున్న ఆడపడుచులు ఇబ్బంది పడ్డారు. సిద్దిపేట పట్టణం హనుమాన్‌నగర్‌లో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు. భారీ వర్షానికి జహీరాబాద్ పట్టణం జలమయమైంది. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లన్నీ కాలువలయ్యాయి. కోరుట్లలో సాయంత్రం గంట పాటు వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని కన్నాల, బోడగుట్టపల్లిలో పిడుగుపాటుకు ఊర్లల్లోని ఫ్యాన్లు, టీవీలు కాలిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో ఈదురు గాలులు, పిడుగులతో భారీ వర్షం కురిసింది. ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో పిడుగుపాటుకు 7 గేదెలు మృతి చెందాయి. మహబూబాబాద్ జిల్లా నేలవంచలో మేతకు వెళ్లిన 7 ఎడ్లు పిడుగు పడి మృత్యువాత పడ్డాయి.

