పలు జిల్లాల్లో భారీ వర్షం

 పలు జిల్లాల్లో భారీ వర్షం

జగిత్యాల జిల్లాలో భారీ వర్షం పడింది. గంటసేపు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి నీరు చేరటంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడ, మార్కండేయ నగర్, గోవింద్ పల్లి వీధుల్లోకి వరద నీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అవస్థలు పడ్డారు. మరోవైపు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట,వీణవంక, ఇల్లందుకుంట మండలాల్లో భారీ వర్షం పడింది. ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో జనం ఇండ్ల నుంచి బయటికి రావటం లేదు. 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విస్తారంగా వర్షం పడింది. జిల్లాలో కురిసిన  భారీ కురిసిన వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరింది. పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.మరోవైపు ములుగు జిల్లాలో కూడా వర్షం దంచి కొట్టింది. ములుగు ఏజెన్సీ ప్రాంతంలో కురిసిన వర్షానికి వాగులు,వంకలు పొంగిపొర్లాయి.   

పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలో పలు ప్రాంతాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. గంటసేపు కురిసిన వర్షానికి రోడ్లపైకి వరద నీరు చేరింది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. నిర్మల్, కుమ్రంభీం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జిల్లాలో కురిసిన వర్షానికి ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం  కొనసాగుతోంది.