జమ్మూకశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్...పుణెలో వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు

జమ్మూకశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్...పుణెలో వర్షాలకు విరిగిపడ్డ కొండచరియలు
  • ముంబైలో రోడ్లను ముంచెత్తిన వరదలు
  • హిమాచల్ ప్రదేశ్, ఒడిశా అతలాకుతలం
  • పుణె-– ముంబైలో కలిపి 16 మంది.. హిమాచల్‌‌లో ఓ బాలిక మృతి
  • రైల్వే ట్రాకులపై100 టన్నుల శిథిలాలు.. నిలిచిపోయిన రాకపోకలు
  • ఒడిశాకు వాయుగుండం ఎఫెక్ట్.. వరుసగా మూడో రోజు వానలు
  • సోనేపూర్‌‌లో రికార్డు స్థాయి వర్షపాతం.. విద్యాసంస్థలకు సెలవులు
  • రెడ్, ఆరెంజ్ అలర్ట్‌‌లు జారీ చేసిన ఐఎండీ

న్యూఢిల్లీ: రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా జమ్మూకశ్మీర్​లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో 540 మెగావాట్ల క్వార్ హైడ్రోఎలెక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సైట్‌‌ నీటమునిగింది. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు కూడా వర్షాల ధాటికి అతలాకుతలమవుతున్నాయి. మహారాష్ట్రలోని పుణెలో నలుగురు, ముంబైలో ఆరుగురు, చెట్లు కూలి ముగ్గురు చొప్పున మొత్తం 16 మంది మరణించగా, హిమాచల్ ప్రదేశ్ చంబాలో ఓ బాలిక చనిపోయింది. 

భారీ వర్షాలకు పలు రాష్ట్రాల్లో లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ముఖ్యంగా రవాణా పరంగా ముంబై, అహ్మదాబాద్ మార్గంలో 40కి పైగా రైళ్లు రద్దయి వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు. ఆస్తి నష్టం విషయానికి వస్తే.. నిర్దిష్టమైన మొత్తం నగదు విలువ అధికారికంగా పేర్కొనలేదు. అయితే, భారీ స్థాయిలో మౌలిక వసతులు, ఆస్తి నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాలు వరదలు, కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదల వల్ల నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. ఇండియా మెటియోరోలాజికల్ డిపార్ట్‌‌మెంట్(ఐఎండీ) ఇప్పటికే పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌‌లను జారీ చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మహారాష్ట్రలో సహాయక చర్యలు స్పీడప్

మహారాష్ట్రలో భారీ వర్షాలను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దీన్ని ‘ఫోర్స్ మేజ్యూర్ (అనుకోని విపత్తు)’ గా ప్రకటించారు. ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. ఎక్స్‌‌ప్రెస్‌‌ వేపై 70% శిథిలాలను తొలగించి ఒక లేన్‌‌ను పునరుద్ధరించారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తూ రైల్వే ట్రాక్​ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. రైల్వే అధికారులు స్వచ్ఛంద సంస్థల సహాయంతో పాల్ఘర్ తదితర స్టేషన్లలో చిక్కుకుపోయిన ప్రయాణికులకు సుమారు 500 భోజన పొట్లాలు, తాగునీరు, అల్పాహారాలు పంపిణీ చేశారు. ముంబై, సూరత్ వంటి ప్రధాన హబ్‌‌లలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌‌లను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలనికోరారు.

చంబా, కులు జిల్లాల్లో రోడ్లు క్లోజ్​.. 

జమ్మూకశ్మీర్‌‌లోని కిష్త్వార్ ప్రాంతంలో చీనాబ్ నదిపై నిర్మాణంలో ఉన్న 540 మెగావాట్ల క్వార్ హైడ్రోఎలెక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సైట్‌‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన బురద, బండరాళ్ల ప్రవాహంతో అక్కడ పార్క్ చేసిన భారీ డంపర్లు, ట్రక్కులు, జేసీబీలు మట్టి కింద పూర్తిగా కూరుకుపోయాయి. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణనష్టం మాత్రం జరగలేదు. ఇదే సమయంలో దోడా-కిష్త్వార్ నేషనల్ హైవే 244 పై భారీగా బురద, బండరాళ్ల శిథిలాలు చేరడంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. అటు హిమాచల్ ప్రదేశ్‌‌లోనూ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు చంబా, కులు జిల్లాల్లోని కీలక రహదారులు మూసుకుపోయాయి. 

చంబా జిల్లాలో కదులుతున్న వాహనంపై పైనుంచి రాయి పడటంతో కాంగ్రా జిల్లాకు చెందిన దీక్షిత అనే బాలిక(14) మృతి చెందింది. కులు జిల్లాలోని పార్బతి పవర్ స్టేషన్-III జలాశయం నీటిమట్టం పెరగడంతో సెంజ్ నదిలోకి 50 క్యూసెక్కుల అదనపు నీటిని విడుదల చేశారు. మండి జిల్లాలోని జోగిందర్‌‌నగర్‌‌లో అత్యధికంగా 97 మిమీ వర్షపాతం నమోదైంది. కాగా, తూర్పు తీర రాష్ట్రం ఒడిశాలో తీవ్ర వాయుగుండం కారణంగా మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 12 ప్రాంతాల్లో 200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సోనేపూర్‌‌లో అత్యధికంగా 328.4 మిమీ వర్షం కురిసింది. కటక్, సంబల్పూర్ సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, విపత్తు నిర్వహణ సంస్థలు ముమ్మర చర్యలు చేపట్టాయి.

పుణెలో విరిగిపడ్డ కొండచరియలు..

మహారాష్ట్రలోని పుణె జిల్లా మావల్ తహసీల్‌‌లోని పటాన్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడి ఐదు ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘోర ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఖేడ్ తహసీల్‌‌లో వరదలో కొట్టుకుపోయి మరొకరు మరణించారు. ముంబైలో గత రెండు రోజుల్లో చెట్లు కూలి ఇద్దరు.. జూన్ 30న స్కూల్ బస్సుపై చెట్టు కూలి 11 ఏండ్ల బాలుడు.. ఆదివారం మంఖుర్ద్ ప్రాంతంలో  మూడంతస్తుల భవనం కూలి ఆరుగురు చనిపోయారు. వానల కారణంగా రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజుల్లోనే 13 మంది మృతిచెందారు. 

రవాణా పరంగా చూస్తే.. ముంబై, అహ్మదాబాద్ కారిడార్‌‌లో పట్టాలు నీట మునగడంతో పశ్చిమ రైల్వే పరిధిలో 40 కి పైగా రైలు సేవలు దెబ్బతిన్నాయి. రాజధాని, సౌరాష్ట్ర ఎక్స్‌‌ప్రెస్ వంటి 20కి పైగా సుదూర ప్రాంతాల రైళ్లు విరార్, వల్సాద్ స్టేషన్లలో నిలిచిపోయాయి. ముంబై, పుణె ఎక్స్‌‌ప్రెస్‌‌వేపై 100 టన్నుల కొండచరియల శిథిలాలు పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ముంబైలో లోకల్ రైళ్లు 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో రైలు ప్యాసింజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.