యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ..మండుటెండలో నిరీక్షణ

యాదగిరి గుట్టలో భక్తుల రద్దీ..మండుటెండలో నిరీక్షణ

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరి గుట్ట నరసింహుడి క్షేత్రం ప్రతి ఆదివారం భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే రద్దీకి తగినట్లుగా సౌలత్​లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. కార్తీకమాసం చివరివారం కావడంతో ఆదివారం నరసింహుడి క్షేత్రం జనసంద్రంగా మారింది. కొండపైన కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, పార్కింగ్ ఏరియా, వ్రత మండపాలు.. కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం, శివాలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. నరసింహుడి ధర్మదర్శనానికి 6 గంటలు, స్పెషల్ దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. భక్తుల వెహికల్స్​తో యాదగిరి కొండ, కొండ కింద పార్కింగ్ ఏరియా నిండిపోవడంతో యాగశాల కోసం ఏర్పాటు చేసిన మైదానం, పాత గోశాల వైపు వెహికల్స్​ను డైవర్ట్ చేశారు. అవీ నిండిపోవడంతో వైకుంఠ ద్వారం వద్ద రింగు రోడ్డుపై సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వరకు రోడ్డుకు రెండు వైపులా పార్కింగ్ చేశారు. ఇక కొండపైన బస్ బే, పార్కింగ్ ఏరియా మొత్తం నిండిపోవడంతో గంటసేపు కొండపైకి భక్తుల వెహికల్స్​ నిలిపివేశారు. దీంతో ప్రెసిడెన్షియల్ సూట్ రింగ్​రోడ్డు నుంచి ఎగ్జిట్ ఘాట్ రోడ్డు సర్కిల్ వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ కావడంతో ఎండలోనే ఘాట్ రోడ్డుపై నడుచుకుంటూ భక్తులు కొండపైకి చేరుకున్నారు.

కొండపైనా తిప్పలే..

ట్రాఫిక్ జామ్ కారణంగా ఘాట్ రోడ్డు, మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ కష్టపడి కొండపైకి చేరుకున్న భక్తులకు కొండపైనా తిప్పలు తప్పలేదు. ధర్మదర్శన క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్ లు నిండిపోయాయి. స్పెషల్ దర్శన క్యూలైన్లు కూడా నిండిపోవడంతో ఆలయ ఆఫీసర్లు తాత్కాలిక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చంటిపిల్లలతో వచ్చిన భక్తులు సైతం గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చింది. ధర్మదర్శన క్యూలైన్లలో ఇబ్బందులను చూసిన కొందరు భక్తులు రూ.150 చెల్లించి వీఐపీ దర్శన టికెట్లు కొన్నా అవస్థలు తప్పలేదు. వీఐపీ దర్శన క్యూలైన్లు నిండిపోవడంతో.. ఆలయ ఆఫీసర్లు ప్రసాద విక్రయశాల నుంచి ప్రధానాలయ ఉత్తర రాజగోపురం వరకు రెండు వరుసల్లో తాత్కాలిక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో స్వామివారిని దర్శించుకోవడానికి దివ్యాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఆలయానికి కార్తీక శోభ

కార్తీకమాసం ముగుస్తుండడంతో కార్తీక పూజలు నిర్వహించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సత్యనారాయణస్వామి వ్రత పూజల్లో 1,900 మంది దంపతులు పాల్గొన్నారు. వ్రతాల నిర్వహణ ద్వారా ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.15.20 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు చెప్పారు. 

ఒక్కరోజే రూ.1.16 కోట్ల ఆదాయం

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ. 1.16 కోట్ల ఆదాయం సమకూరింది. కార్తీకమాసం ప్రారంభం అయినప్పటి నుంచి వరుసగా మూడు ఆదివారాలు ఆలయానికి రికార్డు స్థాయిలో ఇన్ కం వచ్చింది. ఈ నెల 6న రూ.85.62 లక్షలు, 13న రూ.1.09 కోట్ల ఆదాయం సమకూరగా ఈ వారం ఆ రికార్డు కూడా బ్రేకయింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.44,37,150,  కొండపైకి వెహికల్స్​ ప్రవేశం ద్వారా రూ.9.75 లక్షలు, వీఐపీ దర్శన టికెట్ల విక్రయంతో రూ.18.90 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.9.75 లక్షలు వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు చెప్పారు.