
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం, బషీర్‌బాగ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీ స్టేడియంలో పటిష్టమైన భద్రత నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచే స్టేడియంను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో స్టేడియం మొత్తాన్ని తనిఖీ చేశారు. డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీ సీవీ ఆనంద్, సిటీ సీపీ సందీప్ శాండిల్య, ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్‌కుమార్ స్టేడియాన్ని పరిశీలించారు.
సెక్యూరిటీ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. వీవీఐపీల ఎంట్రీ గేట్స్‌తో పాటు స్టేజీల వద్ద నిర్వహించాల్సిన సెక్యూరిటీకి సంబంధించి దిశానిర్దేశం చేశారు. స్టేడియం లోపల బయట దాదాపు1,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వీఐపీ పాసులున్న నాయకులతో పాటు సభకు వచ్చే కార్యకర్తల ప్రవేశమార్గాలతో కూడిన మ్యాప్ రూపొందించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించే విధంగా ఏర్పాట్లు చేశారు.
బషీర్‌బాగ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ చీఫ్ సుధీర్‌బాబు ట్రాఫిక్‌కు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎల్బీ స్టేడియం చుట్టూ ట్రాఫిక్ దారి మళ్లింపు చేయనున్నారు. వీఐపీ వాహనాల పార్కింగ్‌తో పాటు సభకు వచ్చే కార్యకర్తల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు.
- పబ్లిక్ గార్డెన్స్, ఏఆర్ పెట్రోల్ పంపు జంక్షన్ నుంచి బీజేఆర్ విగ్రహం రూట్‌లో నోఎంట్రీ, నాంపల్లి చాపెల్ రోడ్ మీదుగా డైవర్షన్
- గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ రూట్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు చాపెల్ రోడ్‌లో దారిమళ్లిస్తారు
- బషీర్‌బాగ్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు నో ఎంట్రీ, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్,కింగ్‌కోఠి మీదుగా డైవర్ట్ చేస్తారు
- సుజాత స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు అనుమతి లేదు,నాంపల్లి స్టేషన్ రోడ్ మీదుగా మళ్లిస్తారు