మూడు ప్రాజెక్టులకు సాయం చేయండి

మూడు ప్రాజెక్టులకు సాయం చేయండి
  •      ఏఐబీపీ కింద సాయం కోసం సర్కారు ప్రతిపాదనలు

హైదరాబాద్, వెలుగు :  యాక్సిలరేటెడ్​ఇరిగేషన్​బెనిఫిట్​ప్రోగ్రాం – ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన​(ఏఐబీపీ – పీఎంకేఎస్​వై)లో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రాజెక్టులకు సాయం చేయాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర సర్కార్​ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. చిన్న కాళేశ్వరం (ముక్తేశ్వర్) లిఫ్ట్​స్కీం, మొడికుంట వాగు, చనాకా – కొరాట ప్రాజెక్టులకు ఈ పథకంలో భాగంగా సాయం అందించాలని ప్రపోజల్స్​రెడీ చేస్తున్నారు. సోమవారం సెక్రటేరియట్ లో ఇరిగేషన్​సెక్రటరీ రాహుల్​బొజ్జా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చించారు.

 ఏఐబీపీ స్కీంలో ప్రాజెక్టులను చేర్చితే ఆయకట్టుకు నీళ్లిచ్చే పనుల్లో 60 శాతం నిధులను కేంద్ర సమకూర్చుతుంది. మిగతా 40 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2021లో కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన జీఆర్ఎంబీ గెజిట్​నోటిఫికేషన్​లో ఈ మూడు ప్రాజెక్టులను అనుమతి లేని జాబితాలో చేర్చారు. ఇరిగేషన్​అధికారులు వాటి డీపీఆర్​లను సీడబ్ల్యూసీకి సమర్పించి అన్ని అనుమతులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మూడు ప్రాజెక్టులకు కేంద్ర సాయం కోరాలని నిర్ణయించారు. 

ఇటీవల సీఎం రేవంత్​రెడ్డి, మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్​షెకావత్​తో భేటీ అయినప్పుడు పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నేషనల్​స్టేటస్​ప్రాజెక్టుల పథకం కేంద్రంలో లేనందున ఏఐబీపీ కింద సాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతలకు ఏఐబీపీలో సాయం కోరాలని అనుకున్నా ఆ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీలోని డైరెక్టరేట్లతో పాటు కేంద్ర​అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని టెక్నికల్​అడ్వైజరీ కమిటీ (టీఏసీ) నుంచి అనుమతులు రావాల్సి ఉంది. టీఏసీ క్లియరెన్స్​రాకుండా ఏఐబీపీలో సాయం అందించడం సాధ్యం కాదు కనుక అనుమతులు తీసుకున్న తర్వాతే ఆ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.