లోక్‌సభలో కోతులపై చర్చ.. కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్

లోక్‌సభలో కోతులపై చర్చ.. కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్

కోతుల పోడు పడలేకపోతున్నామంటూ లోక్‌సభలో ఎంపీలంతా ఒక్కసారిగా గళం విప్పారు. గురువారం సభలో వానరాల వల్ల సిటీల్లో సైతం జనాలు ఇబ్బంది పడుతున్నారంటూ చర్చకు తెరలేపారు ఎల్జేపీ ఎంపీ చిరాగ్ పాశ్వాన్. ఢిల్లీలో పార్కులకు వెళ్లాలంటేనే భయం వేస్తోందని చెప్పారాయన. కొన్ని పార్కుల్లో చిన్న పిల్లలపై కోతులు దాడులు చేసిన ఘటనలను ఆయన ప్రస్తావించారు. ‘కోతులున్నాయ్.. జాగ్రత్త’ అని బోర్డులు పార్కుల్లో కనిపిస్తున్నాయని చెప్పారాయన. ఆ వెంటనే బీజేపీ ఎంపీ హేమా మాలిని అందుకుని ఈ సమస్య సీరియస్‌నెస్‌ను వివరించారు.

ఇది సీరియస్ సమస్య.. నాన్చొద్దు

తన నియోజకవర్గం మథురలోని బృందావనంలో కోతుల దాడి వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని హేమా మాలిని ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల్లో ఆహరం దొరక్క కోతులు ఊర్లలోకి వచ్చేస్తున్నాయని, వాటిని తరిమే ప్రయత్నం చేసినప్పుడు జనానికి టెర్రర్ చూపిస్తున్నాయని చెప్పారామె. ఇది చాలా సీరియస్ సమస్య, చూద్దామంటూ నాన్చొద్దు, కేంద్రం తగు చర్యలు తీసుకోవాలి అని ఆమె డిమాండ్ చేశారు.

బృందావనం క్షేత్రంలో భక్తులు కోతులను చూపి భయపడుతున్నారని చెప్పారు హేమా మాలిని. కొందరు భక్తులు వాటికి సమోసా, ఫ్రూటీ లాంటివి ఇస్తున్నారని, ఆ ఫుడ్‌కు కోతులు కూడా అలవాటు పడిపోయాయని తెలిపారు. అడవుల్లో కాయలు, పండ్లు వచ్చే చెట్లు లేకపోవడం వల్ల ఈ సమస్య అని, ఆ తరహా చెట్లను అడవుల్లో పెంచాలని కోరారామె. అలాగే మథురలో కోతుల సఫారీ ఏర్పాటు చేయాలన్నారు.

కళ్లజోడు ఎత్తుకెళ్తే.. ఫ్రూటీ ఇచ్చా

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ తాను ఫేస్ చేసిన ఇబ్బందిని లోక్‌సభలో పంచుకున్నారు. బృందావనం వెళ్లినప్పుడు ఓ కోతి తనపై దూకి కళ్లజోడు ఎత్తుకెళ్లిందని చెప్పారు. దానికి ఫ్రూటీ ప్యాకెట్ ఇచ్చి.. తిరిగి కళ్లద్దాలు తీసుకోగలిగానని తెలిపారు. అద్దాలు జేబులో పెట్టుకోవాలని నోటీస్ బోర్డులు పెట్టి ఉన్నాయని, తాను వాటిని గమనించలేదని చెప్పారు బందోపాధ్యాయ్. అక్కడ పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని, ‘కోతులున్నాయ్.. జాగ్రత్త’ అని బోర్డులు పెట్టి వదిలేయకుండా.. దీనిపై కేంద్రం సీరియస్‌గా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Hema Malini raises terror of monkeys in LS