అయోధ్యలో హేమమాలిని నృత్య ‍ప్రదర్శన

 అయోధ్యలో హేమమాలిని నృత్య ‍ప్రదర్శన

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఇంకా వారం రోజులే టైమ్ ఉంది.  ఈ మహా క్రతువుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.  ఈ నేపధ్యంలో జగద్గురు రామానందాచార్య స్వామి రామభద్రాచార్య అమృత మహోత్సవం అయోధ్యలో జనవరి 14 నుండి జనవరి 22 వరకు జరగనుంది. 

ఈ కార్యక్రమంలో  బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినితో  సహా పలువురు కళాకారులు పాల్గొననున్నారు.  హేమమాలిని స్పెషల్ గా నృత్య ప్రదర్శను ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.    రామాయణం ఆధారంగా ఉండే ఈ నృత్యరూపకాలన్ని ప్రదర్శించే అవకాశం తనకు లభించిందని హేమమాలిని వెల్లడించారు.  గతేడాది నవంబర్‌లో తన లోక్‌సభ నియోజకవర్గంలో సంత్ మీరాబాయి 525వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హేమ మాలిని ఒక నృత్య నాటకాన్ని ప్రదర్శించారు. 

వారం ముందు నుంచే పూజలు..  

శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రధాన కార్యక్రమానికి వారం రోజులు ముందుగా ఈ నెల 16వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్  ఆధ్వర్యంలో 22న రామ్ లల్లా(బాల రాముడు) విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ నెల 14 నుంచి 22 వరకూ అమృత్ మహోత్సవ్ పేరిట రోజూ ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు. ఇక వేడుకలకు వచ్చే వేలాది మంది భక్తుల కోసం అయోధ్యలో టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నారు. వారికి భోజనం, వసతితో పాటు అవసరమైన సౌలతులు కల్పిస్తున్నారు. రామ జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 15 వేల మంది బస చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.