శివరామ్‌‌ వేధింపుల వల్లే నా బిడ్డ ఆత్మహత్య : ప్రవళిక తల్లి విజయ ఆరోపణ

శివరామ్‌‌ వేధింపుల వల్లే  నా బిడ్డ ఆత్మహత్య : ప్రవళిక తల్లి విజయ  ఆరోపణ
  • శివరామ్‌‌ వేధింపుల వల్లే  నా బిడ్డ ఆత్మహత్య
  • నా కూతురు చావుకు కారణమైన వాణ్ని ఉరి తీయ్యాలె
  • ప్రవళిక తల్లి విజయ డిమాండ్‌‌
  • తన బిడ్డ మరణాన్ని రాజకీయం చేయొద్దని వేడుకోలు
  • ఇప్పటికే తన కూతురి జీవితం ఆగమైందని, టార్చర్‌‌‌‌ పెట్టొద్దని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్‌‌లోని అశోక్‌‌నగర్‌‌ హాస్టల్‌‌లో ఆత్మహత్య చేసుకున్న మర్రి ప్రవళిక మృతిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. ప్రవళిక సూసైడ్‌‌కు కారకుడైన శివరామ్‌‌ రాథోడ్‌‌ను ఉరి తీయ్యాలని డిమాండ్‌‌ చేశారు. మంగళవారం తన కుమారుడు ప్రణయ్‌‌తో కలిసి ప్రవళిక తల్లి విజయ ఓ వీడియో రిలీజ్‌‌ చేశారు.

‘‘మాకే ఎండలో పని చాతనైత లేదని మా బిడ్డ, కొడుకును రెండేండ్లుగా హైదరాబాద్‌‌లోనే ఉంచి చదివించుకుంటున్నాం. 23 ఏండ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ బిడ్డ ప్రవళిక మంచిగా చదువుకొని, ఉద్యోగం చేస్తుందనుకుంటే, వాని కండ్లల్ల మన్ను పోసుకున్నడు. శివరామ్‌‌ పెట్టిన టార్చర్‌‌‌‌ తట్టుకోలేక, మాకు చెప్పుకోలేక.. ఆత్మహత్య చేసుకుంది. నా బిడ్డలెక్క ఇంకొకలు కావొద్దంటే వాణ్ని బయటకు రాకుండా చెయ్యాలే. మీ పార్టీలకు ఏమైనా గొడవలుంటే మీరు మీరు చూసుకోండి. మమ్మల్ని అందులోకి లాగి ఇది చెప్పుండ్రి.. అది చెప్పుండ్రి.. ఇది చెయ్యిండ్రి.. అది చెయ్యిండ్రి అంటే మాకు అచ్చిందేమి లేదు.. నా బిడ్డ జీవితం ఆగమైంది.. మమ్ములను టార్చర్ పెట్టకుండ్రి.. నా బిడ్డ ఎట్ల ఉరి ఏసుకున్నదో వాడిని కూడా గట్లనే ఉరి శిక్ష ఎయ్యాలే”అని ఆమె డిమాండ్‌‌ చేశారు.

ఎన్‌‌కౌంటర్‌‌‌‌ చేయాలి.. 

తన అక్క ప్రవళికకు ఓ అమ్మాయి ద్వారా శివరామ్ పరిచయం అయ్యాడని ఆమె తమ్ముడు ప్రణయ్‌‌ కుమార్‌‌‌‌ తెలిపాడు. ‘‘ఇష్టం లేకపోయినా శివరామ్‌‌ అక్కతో మాట్లాడడం, కాల్ చెయ్యడంతోపాటు, హాస్టల్‌‌కి వచ్చి అందరి ముందు మాట్లాడి ఇబ్బంది పెట్టేవాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రవళిక డిప్రషన్‌‌లోకి వెళ్లిపోయింది. శివరామ్‌‌ను ఎన్ కౌంటర్ చేసి, ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి’’అని విజ్ఞప్తి చేశాడు. రోజూ తమ ఇంటికి ఎవరో ఒకరు రాజకీయ నేత రావడం.. అక్క గురించి అడగడంతో తమ కుటుంబ సభ్యులు ఇంకా ఏడుస్తున్నారని చెప్పాడు. మీ రాజకీయాలు మీరు చూసుకోండని, తమ ఇంటికి ఎవ్వరూ రావొద్దని అతను కోరాడు. 

శివరామ్‌‌ను పట్టుకునేందుకు స్పెషల్​ టీమ్స్​

ప్రవళిక ఆత్మహత్య ఘటనను సీరియస్‌‌గా తీసుకున్న పోలీసులు విచారణను స్పీడప్‌‌ చేశారు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల వాంగ్మూలం, ప్రవళిక సూసైడ్‌‌కు ముందు ఆమె ఫ్రెండ్స్‌‌కు పంపిన వాట్సప్‌‌ మేసేజ్‌‌లను పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతి కింద నమోదైన ఐపీసీ 174 సెక్షన్‌‌ను మార్చి, 417, 420, 306 సెక్షన్లను జోడించారు. మరోవైపు, నిందితుడు శివరామ్‌‌ రాథోడ్‌‌ను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.