మనీలాండరింగ్ కేసులో ఈడీ చార్జిషీట్.. బాలీవుడ్‌ నటికి కోట్లలో గిఫ్ట్‌లు

మనీలాండరింగ్ కేసులో ఈడీ చార్జిషీట్.. బాలీవుడ్‌ నటికి కోట్లలో గిఫ్ట్‌లు

రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్‌‌పై ఈడీ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. సుకేశ్‌తో శ్రీలంకన్ బ్యూటీ, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్ కావడంతో ఆమెను ఈడీ పలుమార్లు విచారించింది. ఆమె చెప్పిన వివరాలను ఈ చార్జ్‌షీట్‌లో ఈడీ ఫైల్ చేసింది. 2020 డిసెంబర్‌‌లో తొలిసారి సుకేష్‌ తనను కాంటాక్ట్ చేశాడని కలిశాడని, అతడు శేఖర్ రత్న వేల అన్న పేరుతో పరిచయం చేసుకున్నాడని జాక్వెలిన్ పేర్కొంది. అయితే అతడు ఎవరో తెలియకపోవడంతో మొదట్లో కాల్స్‌కు రెస్పాండ్ కాలేదని, దీంతో తన మేకప్ ఆర్టిస్‌ సాయంతో సుకేష్ నేరుగా కలిశాడని ఆమె వివరించిందని ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. 

కోట్లలో విలువైన గిఫ్ట్‌లు

సుకేష్ భారీగా గిఫ్ట్‌లు ఇచ్చాడని, ప్రైవేట్ జెట్స్‌లో టూర్స్‌కు తీసుకెళ్లాడని జాక్వెలిన్ తమ విచారణలో చెప్పినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆ గిఫ్ట్‌లలో రెండు జతల డైమండ్ ఇయర్ రింగ్స్‌, రెండు లగ్జరీ హెర్మ్‌స్‌ బ్రాస్‌లెట్లు, బెర్కిన్స్‌, గుస్సీ, చానెల్ కంపెనీల డిజైనర్ బ్యాగులు, దాదాపు 30 నుంచి 40 లక్షల పైగా విలువ ఉండే లూయి విట్టన్ షూ లాంటివి ఉన్నాయని అందులో తెలిపింది. అలాగే గుస్సీ కంపెనీ జిమ్‌ డ్రస్, మల్టీ కలర్‌‌ స్టోన్ బ్రాస్‌లెట్ ఇచ్చాడని జాక్వెలిన్ చెప్పిందని ఈడీ వెల్లడించింది. అలాగే మినీ కూపర్ బ్రాండ్ కారును ఇవ్వగా దానిని సుకేష్‌కు తిరిగి ఇచ్చేసినట్లు ఆమె చెప్పింది. జాక్వెలిన్‌తో పాటు ఆమె సోదరి, పేరెంట్స్‌కు కూడా సుకేష్‌ గిఫ్ట్‌లు ఇచ్చాడు. సుమారుగా రూ. 10 కోట్ల వరకూ విలువైన గిఫ్ట్‌లు ఇచ్చినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.

జయలలితకు సన్నిహితుడని చెప్పి పరిచయం

సుకేష్ చంద్రశేఖర్ తనను తాను సన్‌ టీవీ ఓనర్‌‌ అని చెప్పి పరిచయం చేసుకున్నాడని జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.. ఈడీకి చెప్పింది. అలాగే తమిళనాడు దివంగత సీఎం జయలలితకు సన్నిహితుడినని కూడా చెప్పుకున్నాడని ఆ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. ఆమెకు తాను చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పిన సుకేష్.. సౌత్‌లో తాను తీయబోయే సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పినట్లు తెలిపింది.