
అనగనగా’ చిత్రానికి తాము అనుకున్నదాని కంటే మంచి రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పాడు సుమంత్. ఆయన హీరోగా సన్నీ కుమార్ దర్శకత్వంలో రాకేష్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించారు. ఇటీవల ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అతిథిగా హాజరైన అడివి శేష్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో వ్యాస్ పాత్రను సుమంత్ అంత బాగా చేయడానికి కారణం ఆయన నిజ జీవితంలోనూ చాలా వరకూ అలా ఉండటమే. ఈ సినిమా చూస్తున్నంత సేపూ దీన్ని థియేటర్లో కదా చూడాల్సింది అనిపించింది.
ఈ చిత్రంలో రామ్ పాత్ర నాతో కూడా కంటతడి పెట్టించింది. ఈ సినిమా నన్నెంత ఏడిపించిందో.. అంతే నవ్వించింది.. ప్రేమలో పడేసింది. విద్యా వ్యవస్థ మారాలని కోరుకునేలా చేయించింది. ఇది సినిమా కాదు ఒక జీవితం. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా కంగ్రాచ్యులేషన్స్’ అని చెప్పాడు. సుమంత్ మాట్లాడుతూ ‘‘మళ్లీరావా’ తర్వాత నాకు మంచి అనుభూతిని అందించిన కథ ఇది. ఆడియన్స్ మేము అనుకున్న దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు.
బేసిక్‌గా సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చిన తర్వాత ఓటీటీలోకి వస్తాయి. అయితే ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఇప్పుడు సినిమాని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. అందరూ బిగ్ స్క్రీన్ మీద చూడాలని కోరుకుంటున్నారు’ అని అన్నాడు. ఈ సక్సెస్ తమలో కాన్ఫిడెన్స్‌ను నింపిందని దర్శక నిర్మాతలు అన్నారు. నిర్మాతలు వంశీ నందిపాటి, రాహుల్ యాదవ్ నక్కా టీమ్‌ను విష్ చేశారు.