హీరో మోటోకార్ప్ లాభం రూ. 943.46 కోట్లు

హీరో మోటోకార్ప్ లాభం రూ. 943.46 కోట్లు

న్యూఢిల్లీ: ఆటోమొబైల్​ కంపెనీ హీరో మోటోకార్ప్​ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో నికరలాభం (కన్సాలిడేటెడ్​) 16.7 శాతం పెరిగి రూ. 943.46 కోట్లకు చేరుకుంది.  అధిక అమ్మకాల కారణంగా లాభం బాగుందని కంపెనీ పేర్కొంది. ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీకి రూ. 810.8 కోట్ల లాభం వచ్చిందని హీరో మోటోకార్ప్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌లో తెలిపింది. తాజా క్వార్టర్​లో కార్యకలాపాల ద్వారా ఆదాయం (కన్సాలిడేటెడ్​) రూ. 9,616.68 కోట్లుగా ఉంది. ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో రూ. 8,434.28 కోట్లు వచ్చాయి.

హీరో మోటోకార్ప్ గత మార్చి క్వార్టర్​లో 12.70 లక్షల యూనిట్లు విక్రయించగా, ఈసారి మార్చి క్వార్టర్​లో  13.92 లక్షల యూనిట్లను అమ్మింది. తాజా క్వార్టర్​లో మొత్తం ఖర్చులు రూ. 8,427.36 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ.7,508.94 కోట్లు ఖర్చు అయ్యాయి. మార్చి 31, 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి రూ. 3,742.16 కోట్ల లాభం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో రూ. 2.799.9 కోట్లు వచ్చాయి. ఇదేకాలంలో ఆదాయం రూ. 34,158.38 కోట్ల నుంచి రూ. 37,788.62 కోట్లకు పెరిగింది. అమ్మకాలు 53.29 లక్షల యూనిట్ల నుంచి 56.21 లక్షల యూనిట్లకు పెరిగాయి.   రూ. 2 ముఖ విలువ గల ఈక్విటీ షేరుకు రూ. 40 తుది డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫార్సు చేసింది.