నాని, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఆగస్టు 29న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోందని టీమ్ చెబుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం విజయ వేడుక పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, దర్శకులు హను రాఘవపూడి, శివ నిర్వాణ, రాహుల్ సంకృత్యాన్ అతిథులుగా హాజరై సినిమా విజయం పట్ల ఆనందంగా ఉందన్నారు. నాని మాట్లాడుతూ ‘ఈ వేడుక చూస్తుంటే మనసు నిండిపోయింది. చుట్టూ వరదలు ఉన్నాయి.
చాలా మందికి కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో సినిమాకి బ్రహ్మరథం పట్టిన ఆడియెన్స్‌కి థాంక్ యూ. సినిమా సక్సెస్ అవుతుందని నేను ముందు నుంచీ నమ్మాను. ప్రతి టీం మెంబర్ మనసు విప్పి సంతోషంగా మాట్లాడుతుంటే ఇది కదా నిజమైన సక్సెస్‌కి నిర్వచనం అనిపిస్తుంది’ అని చెప్పాడు. తాను పోషించిన చారు పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రియాంక చెప్పింది. ఈ సక్సెస్ టీమ్ అందరిది అని వివేక్ ఆత్రేయ అన్నాడు. ఈ విజయంలో భాగమవడం సంతోషంగా ఉందని నటులు ఎస్ జే సూర్య, శుభలేఖ సుధాకర్, అలీ, హర్షవర్ధన్ అన్నారు.