ఈడీ విచారణకు నవదీప్.. 8 గంటలు ప్రశ్నించిన అధికారులు

ఈడీ విచారణకు నవదీప్.. 8 గంటలు ప్రశ్నించిన అధికారులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: డ్రగ్స్‌‌‌‌ కేసులో టాలీవుడ్​ యాక్టర్​నవదీప్‌‌‌‌ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) విచారణకు హాజరయ్యారు. మాదాపూర్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ పార్టీ కేసు, 2017లో నమోదైన టాలీవుడ్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ కేసులో నవదీప్‌‌‌‌కు ఈడీ సమన్లు అందించింది. దీంతో సైఫాబాద్‌‌‌‌లోని ఈడీ ఆఫీసుకు మంగళవారం ఉదయం 10.40కు నవదీప్‌‌‌‌ చేరుకున్నారు. జాయింట్ డైరెక్టర్‌‌‌‌ రోహిత్‌‌‌‌ ఆనంద్‌‌‌‌ ఆధ్వర్యంలోని ఐదుగురి స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఆయనను ప్రశ్నించింది. నోటీసుల్లో పేర్కొన్న విధంగా బ్యాంక్ స్టేట్‌‌‌‌మెంట్స్, పాన్‌‌‌‌ కార్డ్‌‌‌‌ సహా ఇతర డాక్యుమెంట్లను తీసుకొచ్చారు. రాత్రి 7 గంటల వరకు దాదాపు 8 గంటల పాటు ప్రశ్నించింది. ప్రధానంగా డ్రగ్స్ పెడ్లర్లతో నవదీప్‌‌‌‌కు ఉన్న కాంటాక్ట్స్‌‌‌‌ ఆధారంగా విచారించింది. 

అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలపై వివరాలు సేకరించింది. మళ్లీ పిలిచినప్పుడు విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. కాగా, నవదీప్‌‌‌‌కు అత్యంత సన్నిహితుడైన వరంగల్‌‌‌‌కు చెందిన రాంచంద్‌‌‌‌.. మాదాపూర్‌‌‌‌‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ కేసులో అరెస్ట్‌‌‌‌ అయ్యాడు. బెంగళూరులో షెల్టర్ తీసుకుంటున్న నైజీరియన్స్‌‌‌‌ అమోబి చుక్వుడి, మైకేల్‌‌‌‌, థామస్‌‌‌‌ అనఘల వద్ద రాంచంద్‌‌‌‌ డ్రగ్స్‌‌‌‌ కొనుగోలు చేసి, హైదరాబాద్‌‌‌‌లో కస్టమర్లకు అమ్మేవాడు. 

హీరో నవదీప్‌‌‌‌కు కూడా డ్రగ్స్ అందించేవాడని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలోనే నైజీరియన్స్‌‌‌‌తో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. దీంతో పాటు 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్‌‌‌‌ కేసులో కూడా నవదీప్‌‌‌‌ నుంచి వివరాలు రాబడుతున్నది.