సినీ నటి మాధవీలతకు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

సినీ నటి మాధవీలతకు బీజేపీ ఎమ్మెల్యే టికెట్

పార్టీలో నమ్మకస్తులైన నాయకులతోపాటు… జనంలో పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలను కూడా ఎన్నికల్లో పోటీలో దింపుతోంది బీజేపీ. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేష్మ రాథోడ్ ను ఖమ్మంనుంచి అసెంబ్లీ పోటీలో నిలిపారు కమలం లీడర్స్. తాజాగా.. ఏపీలోనూ మరో సినీనటిని అసెంబ్లీ ఎన్నికల రేసులో ఉంచారు.

నచ్చావులే సినిమాతో ఫేమస్సయిన సినీ నటి మాధవీలత ఆంధ్రప్రదేశ్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఏపీ బీజేపీ ఆదివారం విడుదల చేసిన అభ్యర్థుల తొలిజాబితాలో ఆమె పేరు ఉంది. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాధవీలత బీజేపీ టికెట్ ను సంపాదించారు.  

గుంటూరు వెస్ట్ టికెట్ కోసం బీజేపీలో పదిమంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న బీజేపీ నేత వల్లూరి జయప్రకాష్‌ సహాయంతో.. మాధవీలత పార్టీలో చేరారు. ఇపుడు ఆమెకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ దక్కింది.

2018 మేలో బీజేపీలో చేరిన మాధవీ లత

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు… మాధవీలతతో చర్చలు జరిపి బీజేపీలోకి ఆహ్వానించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమక్షంలో హైదరాబాద్ లో పార్టీ కండువా కప్పుకున్నారామె. పవన్ కల్యాణ్ అంటే తనకు ఇష్టమైనా కూడా.. అది వ్యక్తిగతం అనీ.. దేశ సేవ, రాజకీయాల గురించి చూస్తే.. మోడీ తీరు నచ్చి బీజేపీలో చేరానని చెప్పారు. భారతీయత అన్న ఐడియాలజీ నచ్చి బీజేపీలో చేరానన్నారు.

మాధవీలత బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో ఒకరు. క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూపై ఓపెన్ గా మాట్లాడి సోషల్ మీడియాలో ఆ మధ్య సంచలనం రేపారు మాధవీలత. అంతకుముందు జనసేన నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.