
- పీఎం కిసాన్‌కు 68 వేల కోట్లు.. ఎంఎస్పీ చెల్లింపులకు రూ.2.37 లక్షల కోట్లు
- రైతుల రుణాలకు 18 లక్షల కోట్లు
- టెక్నాలజీ వినియోగానికి పెద్దపీట
- కిసాన్ ద్రోన్ల ద్వారా ల్యాండ్ సర్వేలు, మందుల పిచికారీ
- అగ్రి స్టార్టప్ లకు ఆర్ధిక సాయం
- కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ కు ప్రోత్సాహం
న్యూఢిల్లీ/ హైదరాబాద్, వెలుగు: వ్యవ‘సాయం’ ఇంకాస్త పెరిగింది. హైటెక్ సాగుకు కేంద్రం జైకొట్టింది. వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖకు రూ.1,32,513 కోట్లను కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది 4.5 శాతం ఎక్కువ. అగ్రి స్టార్టప్స్‌కు ఆర్థిక సాయం అందిస్తామని, కిసాన్ డ్రోన్లు అందుబాటులోకి తెస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో హైటెక్ అగ్రి సర్వీసులను అందిస్తామని తెలిపారు. ఫిషరీస్, అనిమల్ హస్బండరీ, డైరీయింగ్ మినిస్ట్రీకి 6,407.31 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 44 శాతం ఎక్కువ. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు కేటాయింపులను 2.25 రెట్లు పెంచారు. తాజాగా రూ.2,941.99 కోట్లు ఇచ్చారు. వ్యవసాయ–అటవీ పెంపకాన్ని ప్రోత్సహించడానికి, ఇందుకోసం సమగ్ర ప్యాకేజీని అమలు చేయడానికి ప్రభుత్వం చట్టపరమైన మార్పులు చేయనుందని నిర్మల చెప్పారు. ప్రాసెస్ చేయగల పండ్లు, కూరగాయలను రాష్ట్రాలు పండించాలని కోరారు.
మందుల్లేని పంటలు.. ముందుగా గంగమ్మ దగ్గర
రసాయనాలు లేకుండా పంటలు పండించడాన్ని ప్రోత్సహిస్తామని నిర్మల తెలిపారు. కెమికల్ ఫ్రీ ఫార్మింగ్‌ను మొదటి దశలో గంగా నదికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతుల భూముల్లో అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. న్యాచురల్, జీరో బడ్జెట్, సేంద్రియ వ్యవసాయం, మోడర్న్ వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ వర్సిటీల సిలబస్‌లను సవరించడానికి రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని తెలిపారు. పంట పరిశీలన, ల్యాండ్ రికార్డుల డిజిటలైజేషన్, పురుగుల మందు పిచాకారీ కోసం కిసాన్ డ్రోన్ల ఉపయోగాన్ని ప్రమోట్ చేస్తామన్నారు. దేశీయ నూనెగింజల ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం సమగ్ర పథకాన్ని అమలు చేయనుందని నిర్మల తెలిపారు. తద్వారా దేశం నూనెల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని చెప్పారు. 2023ని మిల్లెట్ ఇయర్‌గా ప్రకటించడంతో.. దేశవ్యాప్తంగా మిల్లెట్స్ సాగును, వినియోగాన్ని ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు.
పేపర్‌లెస్ సేకరణ.. ఈ–బిల్లింగ్
2021– 22లో 1.63 కోట్ల మంది రైతుల నుంచి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కింద 1,208 లక్షల టన్నుల గోధుమలు, బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నిర్మల తెలిపారు. ఇందుకోసం రూ.2.37 లక్షల కోట్లు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి నేరుగా వేస్తామన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన లావాదేవీలను పూర్తిగా పేపర్ లెస్‌గా చేస్తామని, ఇందుకోసం ఈ– బిల్ సిస్టమ్ తీసుకొస్తామని చెప్పారు. వ్యవసాయ రంగంలో ఉన్న స్టార్టప్‌లు, గ్రామీణ పరిశ్రమలకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. అగ్రికల్చర్ సెక్టార్‌లో వాల్యూ చైన్‌ను విస్తరించి, రైతుల వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంచడానికి ఈ స్టార్టప్‌లను ప్రోత్సహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం నాబార్డ్ ద్వారా కో ఇన్వెస్ట్‌మెంట్ మోడల్ కింద సేకరించిన నిధిని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 700లకు పైగా అగ్రి స్టార్టప్‌లు ఉన్నాయి. కాగా, రూ.44,605 కోట్లతో కెన్– బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు నిర్మల తెలిపారు.
రైతు రుణాల టార్గెట్ పెంపు
వ్యవసాయ రుణ లక్ష్యాన్ని కేంద్రం పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో 16.5 లక్షల కోట్లుగా ఉన్న క్రెడిట్ టార్గెట్‌ను.. 2022– 23లో 18 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు నిర్మల ప్రకటించారు. గతేడాది టార్గెట్‌లో 75 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు.
కస్టమర్ హైరింగ్ సెంటర్ల ఏర్పాటు
వ్యవసాయ రంగంలో కూలీల కొరత ఎక్కువగా ఉంది. చిన్న, సన్నకారు రైతులు పెద్ద యంత్రాలను, పరికరాలను సమకూర్చుకోలేరు. దీంతో యంత్రాలు, వ్యవసాయ పనిముట్లను రైతులకు కిరాయికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీని వల్ల వ్యవసాయ కూలీల కొరతను అధిగమించడంతో పాటు, రైతుకు పంటపై వచ్చే రాబడి కూడా పెరిగే అవకాశం ఉంది. గ్రామీణ స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్స్ (సీహెచ్‌సీ) లను స్థాపించడం ద్వారా హైటెక్, హైవాల్యూ ఫామ్ పరికరాలు, ఫామ్ మెషినరీ బ్యాంకుల కోసం హబ్‌లను సృష్టించి.. చిన్న, సన్నకారు రైతులకు (ఎస్‌ఎంఎఫ్) వ్యవసాయ యంత్రాలను అందుబాటులోకి తీసుకురానుంది. రైతులకు ఇప్పటికే సబ్సిడీ కింద వ్యవసాయ పరికరాలు, యంత్రాలను అందిస్తున్నారు. దేశంలో 27,500కు పైగా కస్టమ్ హైరింగ్ సంస్థలు ఏర్పాటయ్యాయి. వీటిని మరింత విస్తరించనున్నారు. సీహెచ్‌సీలు పెట్టుకునేందుకు కేంద్రం సాయం చేయనుంది.