Ayodhya: రామ మందిరాన్ని పేల్చేస్తాం.. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ హెచ్చరికలు

Ayodhya: రామ మందిరాన్ని పేల్చేస్తాం.. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ హెచ్చరికలు

ఉత్తరప్రదేశ్‌: అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరాన్ని పేల్చేస్తామంటూ పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్రవాద (Jaish-E-Mohammed) సంస్థ హెచ్చరించినట్లు ఓ ఆడియో కలకలం రేపింది. వైరల్‌గా మారిన సదరు ఆడియో సందేశంలో జైషే మహ్మద్ రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరించింది. ఉగ్రమూకలు బాంబులతో రామ మందిరంపై దాడి చేస్తామంటూ ఆ ఆడియోలో ఉన్నట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

జైషే మహ్మద్‌ హెచ్చరికల నేపథ్యంలో రామ మందిర పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రామాలయం వద్ద నిఘా ముమ్మరం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా రామమందిరం, దాని ప్రక్కనే ఉన్న అప్రోచ్ రోడ్లు, ఇతర ప్రధాన సంస్థల చుట్టూ భద్రతను పెంచారు. మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్‌ నయ్యర్‌ శుక్రవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

2005లో ఉగ్ర దాడి 

2005లో రామజన్మభూమి కాంప్లెక్స్‌పై ఉగ్ర దాడి సమయంలో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. 2005లో రామ మందిరంపై జైషే మహ్మద్‌ సంస్థ దాడికి పాల్పడింది. పేలుడు పదార్థాలు నింపిన జీపుతో మందిరం వద్ద విధ్వంసం సృష్టించింది. అప్పటినుంచి రామజన్మభూమిపై జైషే మహ్మద్ నిరంతరం విషం చిమ్ముతూనే ఉంది. రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్టకు ముందు కూడా ఈ ఉగ్రవాద సంస్థ ఇలాంటి బెదిరింపులు చేసింది.

కాగా, రామ మందిరాన్ని నిర్మించినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం భద్రతకు సంబంధించి కొత్త ఏర్పాట్లపై నిరంతరం కసరత్తు చేస్తోంది. అయోధ్యలో NSG కేంద్రాన్ని కూడా ప్రతిపాదించింది. అయితే, రామాలయానికి తీవ్రవాద సంస్థ నుంచి ఎలాంటి ముప్పు పొంచివుందో తెలియదని ఎస్ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ తెలిపారు. ఆడియో గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అయోధ్య ధామ్ వద్ద ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్ఎస్పీ నయ్యర్ మీడియాకు తెలిపారు.

జిల్లా పోలీసులతో పాటు పలు పీఏసీ కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. ముఖ్యమైన ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా ఆ ప్రాంతమంతా పర్యవేక్షిస్తున్నారు.