సాగర్ పవర్ ప్లాంట్ వద్ద హై అలర్ట్

సాగర్ పవర్ ప్లాంట్ వద్ద హై అలర్ట్
  • పోలీస్ ​పహారాలో కరెంట్‌ తయారీ

హాలియా/మేళ్లచెరువు, వెలుగు: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో నాగార్జునసాగర్​ప్రాజెక్ట్​ వద్ద పోలీసులు హై అలర్ట్​ ప్రకటించారు.  శ్రీశైలం ప్రాజెక్టు వద్ద తెలంగాణ విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ సర్కార్​ విద్యుత్ ఉత్పాదన చేపట్టింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం డ్యాం లో కనీస నీటిమట్టం 834 అడుగులకు పైగా ఉన్నప్పుడు మాత్రమే కరెంటును ఉత్పత్తి చేయాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు సూచించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ వాదనను తోసిపుచ్చి తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జల విద్యుత్ కేంద్రాల్లో వంద శాతం  విద్యుత్తును ఉత్పత్తి చేయాలని జెన్​కో ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై ఏపీ సర్కార్​కృష్ణా ట్రిబ్యునల్​కు ఫిర్యాదు చేసింది. రెండు రాష్ట్రాల మధ్య వాటర్​ వార్ ​ముదురుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద విద్యుత్​ఉత్పాదన చేస్తే ఏపీకి చెందిన నేతలు, లేదా కార్యకర్తలు గొడవలు చేస్తారని ముందస్తు జాగ్రత్త చర్యల్లో  భాగంగా డీఐజీ రంగనాథ్​ నేతృత్వంలో నాగార్జునసాగర్ ​వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాగర్​లో సుమారు 200 మంది సీఆర్​పీఎఫ్​ బలగాలు, ఇద్దరు డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, 8 మంది ఎస్సైలు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పవర్​ప్లాంట్​తోపాటు కొత్త బ్రిడ్జి వద్ద గల ఆంధ్రా‌‌‌‌‌‌‌‌, తెలంగాణ బార్డర్​ చెక్​పోస్ట్​ దగ్గర పోలీసులను మోహరించారు. పోలీస్​ పహారా నడుమ సాగర్ పవర్​ప్లాంట్​నుంచి  జెన్​కో అధికారులు విద్యుత్​ఉత్పత్తిని పూర్తిస్థాయిలో ప్రారంభించారు. కాగా ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్​ విద్యుత్​ఉత్పాదన ద్వారా నాగార్జునసాగర్​కు 26,227 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్​లోకి ఇన్​ఫ్లోగా వస్తోంది. సాగర్​ విద్యుత్​పవర్​ప్లాంట్​ద్వారా 21వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. ప్రాజెక్టుల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. 

పులిచింతలలో రెండు యూనిట్లతో..
సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జెన్ కో లో మంగళవారం రాత్రి నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. పులిచింతల జెన్ కో లో మొత్తం 4 యూనిట్లు ఉండగా ప్రస్తుతం రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ఎస్ఈ దేశ్యా వెల్లడించారు. ఇందుకోసం నాలుగు వేల క్యూసెక్కుల నీటిని వాడుకున్నట్లు చెప్పారు. ఎగువ నుంచి ఇన్ ఫ్లో పెరుగుతుండటంతో మిగిలిన రెండు యూనిట్లను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. పులిచింతల డ్యాం, జెన్ కో వద్ద సుమారు 90 మంది పోలీసు సిబ్బందితో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 18 టీఎంసీల నీరు నిల్వ ఉంది.