హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) డివిజన్ల సంఖ్యను 150 నుంచి 300కు పెంచే ప్రక్రియను నిలిపివేస్తూ ఉత్తర్వులను జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై స్టే ఆదేశాలు జారీ చేయబోమని తేల్చి చెప్పింది. డీలిమిటేషన్‌లో భాగంగా చేపట్టిన జనాభా వివరాలు, మ్యాప్‌లు బయటపెట్టడంలో వచ్చే నష్టమేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 24 గంటల్లో వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది.
వీటిపై అభ్యంతరాలు సమర్పించేందుకు పిటిషనర్లు, ప్రజలకు రెండ్రోజులు గడువు ఇవ్వాలని సూచించింది. వాస్తవానికి ఈ నెల 17తో అభ్యంతరాలకు గడువు ముగిసింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో 24 గంటల్లో పబ్లిక్ డొమైన్‌లో వార్డుల విభజన, జనాభా, మ్యాప్‌లను పెట్టిన తర్వాత ప్రజలు లేవెత్తే అభ్యంతరాలను స్వీకరించేందకు మరో రెండ్రోజుల గడువు ఇవ్వాలంది.
