ఇండ్ల జాగాకు.. రైతు బంధు ఎట్లిస్తరు: హైకోర్టు

ఇండ్ల జాగాకు.. రైతు బంధు ఎట్లిస్తరు: హైకోర్టు
  • ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు


హైదరాబాద్, వెలుగు: ఇండ్లు కట్టుకున్న స్థలాలకు రైతు బంధు ఇవ్వడం ఏంటని, వ్యవసాయ భూమి కాకపోయినా లక్షల రూపాయలు ఎలా ఇచ్చారని ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 17 ఏండ్ల కిందే ఓ రైతు తన వ్యవసాయ భూమిని ఇండ్ల స్థలాలుగా మార్చేసి అమ్మేశాడని గుర్తు చేసింది. ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లు కూడా ఇండ్లు నిర్మించుకున్నారని తెలిపింది. అలాంటప్పుడు అది సాగు భూమి ఎలా అవుతుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సాగు భూమే లేకున్నా రైతు బంధు ఎలా ఇస్తారని అధికారులను నిలదీసింది. 

భూమి అమ్మేసిన పాత యజమానికే లక్షల్లో రైతు బంధు ఎలా ముట్టజెప్తున్నారని మండిపడింది. అధికారుల తీరు ఏమాత్రం ఉపేక్షించేలా లేదని అసహనం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల సరిహద్దు ఇబ్రహీంపూర్, బిల్కల్ గ్రామాల పరిధిలోని దాదాపు 65 ఎకరాల భూమిని 17 ఏండ్ల కింద ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. 

వాటిని కొనుగోలు చేసిన వాళ్లు అపెక్స్ రిసార్ట్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్నారు. భూమి పాత యజమానికి ప్రభుత్వం రైతు బంధు ఇస్తుండటంతో అసోసియేషన్ సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం జస్టిస్ బి.విజయ్​సేన్ రెడ్డి విచారణ జరిపారు. 

పాత యజమాని పేరిట పాస్ పుస్తకాలు
పిటిషనర్ తరఫు అడ్వకేట్ వెంకటరామయ్య వాదనలు వినిపించారు. పాత యజమానికి రైతుబంధు చెల్లింపులు నిలిపివేయాలని కోరారు. ఈమేరకు అధికారులకు చాలాసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. ఇక వేరే మార్గం లేక హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేయకుండానే 17 ఏండ్ల కింద ఉన్న పాత యజమాని పేరిట కొత్త పాసు పుస్తకాలు జారీ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రైతు బంధు ప్రారంభించినప్పటి నుంచి లక్షల్లో చెల్లింపులు జరిగాయని తెలిపారు. ప్రజా ధనం దుర్వినియోగం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

17 ఏండ్ల కింద ఇండ్ల స్థలాలు కొనుగోలు చేసిన భూమికి పాత రైతుకు స్కీమ్ అమలు చేయడం దారుణమన్నారు. భూమి ఎవరిది.. యాజమాన్య హక్కులు ఎవరివో గుర్తించకుండా అధికారులు ఇష్టారీతిన వ్యవహరించారని తెలిపారు.. ఇండ్లు కట్టుకున్న స్థలాలకు రైతు బంధు చెల్లించడం విడ్డూరంగా ఉందని పిటిషన్ తరఫు అడ్వకేట్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

రైతు బంధు చెల్లింపుల చెక్కులను కోర్టుకు సబ్మిట్ చేశామన్నారు. స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెవెన్యూ శాఖ చీఫ్ సెక్రటరీ, సీసీఎల్, సంగారెడ్డి, వికారాబాద్‌‌‌‌ కలెక్టర్లు, మునిపల్లి, మారపల్లి మండలాల తహసీల్దార్లు, పాత భూ యజమాని అద్దంకి స్వామి నాయుడుతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది.