గవర్నమెంట్‌‌‌‌ ఎంప్లాయీని పెండ్లాడితేనే బదిలీ చేస్తరా?

గవర్నమెంట్‌‌‌‌ ఎంప్లాయీని పెండ్లాడితేనే బదిలీ చేస్తరా?
  • టీచర్ల బదిలీల కేసులో  సర్కార్​ను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: గవర్నమెంట్‌‌‌‌ ఎంప్లాయీని పెండ్లాడితేనే టీచర్లను బదిలీ చేస్తారా అని రాష్ట్ర సర్కార్‌‌‌‌ను హైకోర్టు ప్రశ్నించింది.  ప్రభుత్వ ఉద్యోగులు ఒకే ప్రాంతం లేదా సమీపంలో ఉండేలా చూడటానికే అదనపు పాయింట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెప్పడంతో  హైకోర్టు నిలదీసింది. దీనిపై అదనపు అడ్వొకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ రామచంద్రరావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులైన దంపతులు వేర్వేరు చోట్ల ఉంటే ఇబ్బందులు పడతారని  ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందన్నారు. 

టీచర్ల బదిలీలో భార్యాభర్తలకు, ఉపాధ్యాయ సంఘ సభ్యులకు అదనపు పాయింట్లు ఇవ్వడం అన్యాయమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్లను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ ఆరాధే, జస్టిస్‌‌‌‌ వినోద్​కుమార్‌‌‌‌తో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ సోమవారం విచారించింది. గవ ర్నమెంట్‌‌‌‌ తరఫున ఏఏజీ రామచంద్రరావు, పబ్లిక్‌‌‌‌ సర్వీస్‌‌‌‌ కమిషన్‌‌‌‌ తరఫున రాంగోపాల్‌‌‌‌ రావు వాదించారు. పిటిషన్ల కారణంగా 60 వేలమంది టీచర్ల బదిలీలు, ప్రమోషన్స్‌‌‌‌ నిలిచిపోయాయని తెలిపారు. సత్వరం విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పాలని కోరారు. ప్రభుత్వ అఫిడవిట్‌‌‌‌ పరిశీలనకు గడువు కావాలని పిటిషనర్ల లాయర్లు కోరడంపై ఏఏజీ అభ్యంతరం చెప్పారు.  దీంతో ఈ నెల 23న తుది విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.