ప్రభుత్వానికి ఇంత అహంకారమా?..బ్రిటిష్​ దొరల పాలన కన్నా ఘోరం

ప్రభుత్వానికి  ఇంత అహంకారమా?..బ్రిటిష్​ దొరల పాలన కన్నా ఘోరం

హైదరాబాద్, వెలుగు:బ్రిటిష్​ దొరల పాలన కన్నా ఘోరంగా రాష్ట్రంలో పాలన ఉన్నట్లు అనిపిస్తోందని, కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత అహంకారమా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్లో స్పానిష్​ ఫ్లూ వచ్చినప్పుడు కూడా బ్రిటిష్​ వాళ్లు  ఇలా జనాన్ని నిర్లక్ష్యంగా వదిలేయలేదని గుర్తుచేసింది. ‘‘గాంధీ ఆస్పత్రిని కరోనా ట్రీట్​మెంట్​ కోసం కేటాయించినట్లు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరి అక్కడ కరోనా టెస్ట్‌‌లు చేయడం లేదంటే ఏమనుకోవాలి? ఇది సర్కార్‌‌ అహంకారానికి పరాకాష్ట అనిపిస్తోంది. జనం కరోనాతో చనిపోతుంటే ప్రభుత్వం ఇలా వ్యవహరించడమేంది? ఈ పాలన బ్రిటిష్‌‌  దొరల పాలన కంటే ఘోరంగా జాలి, దయలేనట్లుగా ఉందనిపిస్తోంది. ప్రభుత్వం ఏం చేస్తున్నదో మాకైతే అర్థం కావడం లేదు’’ అని నిప్పులు చెరిగింది. ‘‘నేను క్రికెట్‌‌ ప్లేయర్‌‌ని. బ్యాటింగే కాదు బౌలింగ్​ కూడా చేయను. అయినా నేను క్రికెట్‌‌ ప్లేయర్‌‌నే అన్నట్లుగా గాంధీ ఆస్పత్రి విషయంలో ప్రభుత్వ వైఖరి ఉంది” అని మండిపడింది. టీచింగ్‌‌ ఆస్పత్రుల్ని కరోనా ట్రీట్​మెంట్​ కోసం ఉపయోగించుకునేలా ఉత్తర్వులివ్వాలని, కరోనా ట్రీట్​మెంట్​ ఇచ్చే  ఆస్పత్రుల్లో బెడ్స్‌‌ ఖాళీలను డ్యాష్​ బోర్డుల్లో డిస్‌‌ప్లే చేయాలని,  ప్రైవేట్‌‌ ఆస్పత్రుల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ ఆర్‌‌.శ్రీవాత్సవన్, కర్నాటి శివ గణేష్, డీజీ నర్సింహరావు, శ్రీకిషన్‌‌శర్మ విడివిడిగా దాఖలు చేసిన పిల్స్‌‌ను మంగళవారం చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘బెడ్స్, వెంటిలేటర్స్‌‌ ఎన్ని ఖాళీగా ఉన్నాయో.. కరోనాకు కేటాయించిన ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ వివరాలు తెలియజేయాలి. వరంగల్‌‌ ఆయుర్వేద  టీచింగ్‌‌ ఆస్పత్రి, హైదరాబాద్​లోని నేచర్‌‌క్యూర్, ఆయుర్వేద హాస్పిటల్​ ఐసోలేషన్‌‌కు కేటాయించాలి. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో కేసులు పెరిగితే చెస్ట్, ఫీవర్, నిలోఫర్‌‌ ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ అందించాలి. కరోనా ట్రీట్​మెంట్​ కోసం కేటాయించిన 87 ఆస్పత్రుల లిస్ట్‌‌ ప్రకటించాలి. మొత్తం వివరాల్ని పత్రికల్లో పబ్లిష్‌‌ చేయాలి. డైలీ ఇచ్చే హెల్త్‌‌ బులిటెన్‌‌లో  బెడ్స్, ఇతర వివరాలు కూడా వెల్లడించాలి” అని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మెడికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ డైరెక్టర్‌‌ రమేష్‌‌రెడ్డి, పబ్లిక్‌‌ హెల్త్‌‌ డైరెక్టర్‌‌ శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్‌‌లో విచారణకు హాజరయ్యారు. 87 కరోనా ఆస్పత్రుల్లో 8,834  బెడ్స్‌‌ ఖాళీగా ఉన్నాయని వారు చెప్పారు. గాంధీ హాస్పిటల్​లో ఐదుగురికి ప్లాస్మా చేస్తే ఇద్దరు కోలుకున్నారని వివరించారు. వివిధ ఆస్పత్రుల్లో బెడ్స్, వెంటిలేటర్స్, కరోనా బాధితుల వివరాలు వెల్లడించారు.

ఫీజులపై జీవో ఇచ్చి చేతులు దులుపుకుంటే ఎట్ల?

కార్పొరేట్‌‌  హాస్పిటల్స్​ కరోనా బాధితుల నుంచి లక్షల రూపాయలు ఫీజుల రూపంలో దోచుకోవడాన్ని కట్టడి చేయాలని,  ఇలాంటి వాటిపై ఫిర్యాదుకు వీలుగా ప్రభుత్వం వెబ్‌‌లింక్​ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మనోజ్‌‌ కొఠారి అనే పేషెంట్​కు  యశోదా హాస్పిటల్​ రూ. 4.21 లక్షలు బిల్లు వేసిందని, దీనిపై పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు కూడా చేసినట్లుగా రిట్‌‌లో ఉందని హైకోర్టు గుర్తుచేసింది. మీర్​ అలీఖాన్​ అనే పేషెంట్​కు కిమ్స్​ హాస్పిటల్​లో రూ. 4.25 లక్షల బిల్లు వేశారని, ఇలాంటి హాస్పిటల్స్​ను రద్దు చేస్తాం అని ప్రభుత్వం ఎందుకు నోటీస్​ ఇవ్వలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఫీజులు ఎంత వసూలు చేయాలో జీవో ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, అది అమలు జరుగుతున్న తీరును పర్యవేక్షించాల్సింది ప్రభుత్వమేనన్న విషయం అధికారులు మర్చిపోకూడదని తేల్చిచెప్పింది. కార్పొరేట్‌‌ ఆస్పత్రులపై సర్కార్‌‌ నియంత్రణ ఉందో లేదో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. ప్రైవేట్​ హాస్పిటళ్లలో ఫీజులు ఎంత ఉండాలో తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమని, తాము కాదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దీనికి కేంద్ర ప్రభుత్వం తరఫు లాయర్​ స్పందిస్తూ.. రాష్ట్రాలే నిర్ణయించుకోవాలని కేంద్రం ఆదేశించిందని చెప్పారు. గాంధీ హాస్పిటల్​లో 1,141 బెడ్స్‌‌ ఖాళీగా ఉన్నా.. పాజిటివ్​ రిపోర్టు తెస్తేనే అడ్మిట్​ చేసుకుంటామని చెప్పడం బాధితులు కార్పొరేట్‌‌ ఆస్పత్రులకు వెళ్తున్నారని పిటిషనర్‌‌ లాయర్‌‌ హైకోర్టు దృష్టికి తెచ్చారు. పిల్స్‌‌ అన్నింటి విచారణ ఈ నెల 27కి వాయిదా పడింది.

ఇతరులు మనుషులు కాదా?

ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదిస్తూ.. గాంధీ హాస్పిటల్​లో ఆర్‌‌టీపీసీఆర్‌‌  కిట్స్‌‌ ఉన్నాయని, అయితే వాటిని గర్భిణులకే ఇస్తామని డీఎంవోలు చెబుతున్నారని పేర్కొన్నారు. ‘‘గర్భిణులకు మాత్రమే ఇస్తామంటే ఎట్ల? ఇతరులు మనుషులు కాదా.. వారికి కరోనా వస్తే ఇవ్వరా?. ఇది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును తుంగలోకి తొక్కడమే అవుతుంది” అని హైకోర్టు పేర్కొంది. జాలి, దయ లేనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడింది. ‘‘గాంధీ హాస్పిటల్​లో కరోనా టెస్టులు చేయకపోతే ఎలా? కరోనా గురించి చెప్పగానే అందరికీ గుర్తుకు వచ్చేది గాంధీ హాస్పిటలే కదా? టెస్టులు చేయడం లేదని బాధితులు ఎక్కడి వెళ్లాలి? టెస్టులు ఎందుకు చేయడం లేదు?’’ అని నిలదీసింది. ‘‘రాష్ట్రంలో కరోనా కట్టడికి గాంధీ ఆస్పత్రిని ఎంపిక చేసి ఎంతగానో వైద్యసేవలు అందిస్తున్నట్లుగా ఇప్పటి వరకూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. తీరా చూస్తే అక్కడ టెస్టులు చేయడం లేదని తీరుబడిగా చెబుతోంది” అని వ్యాఖ్యానించింది.

గుప్త నిధుల కోసమే సెక్రటేరియట్ కూల్చివేత