ఖానాపూర్​ భూములపై సుప్రీంకోర్టు చెప్పినా వినరా?.. రాష్ట్ర సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం 

ఖానాపూర్​ భూములపై సుప్రీంకోర్టు చెప్పినా వినరా?.. రాష్ట్ర సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం 

 హైదరాబాద్, వెలుగు: పాస్ బుక్స్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినా పట్టించుకోరా? అని రాష్ట్ర సర్కార్​పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్ లోని 20 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో నుంచి తొలగించి ఈ–పట్టాదారు పాస్‌బుక్స్ జారీ చేయాలని 2019లో మేం ఆదేశించినం. 2021లో సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?” అని ప్రశ్నించింది. దీనికి బాధ్యులైన రంగారెడ్డి జిల్లా అధికారులపై ఫైర్ అయింది. ఈ నెల 20న జరిగే విచారణకు పాస్ బుక్స్ తీసుకుని అధికారులు స్వయంగా రావాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.హరీశ్, రాజేంద్రనగర్‌ ఆర్డీవో కె.చంద్రకళ, గండిపేట తహసీల్దార్‌ ఎ.రాజశేఖర్‌ విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. తమ ఆదేశాలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ ఇవ్వాలంటూ జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాలేదంటూ ప్రతాప్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గ్రూప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహా నలుగురు వేసిన కోర్టుధిక్కార పిటిషన్​పై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. 

ఏప్రిల్​లోనే జారీ చేశామన్న ప్రభుత్వం.. 

20 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంపై పిటిషనర్లు గతంలో హైకోర్టులో రిట్లు దాఖలు చేశారు. నిషేధిత లిస్ట్‌ నుంచి తొలగించి పాస్‌బుక్స్‌ ఇవ్వాలని సింగిల్‌ జడ్జి, తర్వాత డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు ఇచ్చాయి. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది. భూహక్కులపై సివిల్‌ కోర్టు ఇచ్చే తీర్పుకు లోబడి ఉండాలని, ఈలోగా పాస్‌బుక్స్‌ జారీ చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. అయితే ఆ ఆదేశాలు అమలు చేయలేదంటూ పిటిషనర్లు కోర్టు ధిక్కార పిటిషన్‌ వేశారు. దీనిపై గత మార్చిలో విచారణ జరగ్గా, పాస్ బుక్స్ జారీకి టైమ్ కావాలని కోర్టును ప్రభుత్వం కోరింది. ఏప్రిల్‌ 24న జరిగిన విచారణలో పాస్‌బుక్స్‌ జారీ చేసినట్లు తెలిపింది. అయితే తాజాగా జరిగిన విచారణలో పాస్‌బుక్స్‌ ఇవ్వలేదని పిటిషనర్ల లాయర్‌ చెప్పడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  పాస్​బుక్స్​తో అధికారులు తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.