ఏ చట్టం ప్రకారం సమ్మెను ఇల్లీగల్ అని ప్రకటించాలి: హైకోర్టు

ఏ చట్టం ప్రకారం సమ్మెను ఇల్లీగల్ అని ప్రకటించాలి: హైకోర్టు
  • ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని ప్రకటించాలంటూ పిటిషన్
  • ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకోవడం కోర్టుల్లో కుదరదన్న ధర్మాసనం
  • విచారణ మంగళవారానికి వాయిదా

ఆర్టీసీ సమ్మె ఇల్లీగల్ అని ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఏ చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. అత్యవరసర సేవలపై మాత్రమే ఎస్మా చట్టం ప్రయోగించడం వీలవుతుందని స్పష్టం చేసింది కోర్టు. ఇష్టం వచ్చినట్లు డెషిషన్ తీసుకోవడం కోర్టుల్లో కుదరదంటూ విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.

ఆర్టీసీ సమ్మె ఇల్లీగల్ అని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ఓయూ విద్యార్థి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది. సమ్మెపై ఎస్మా ప్రయోగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య. అయితే ఆర్టీసీ అనేది పబ్లిక్ యుటిలిటీ సర్వీస్ అనీ… కేవలం ఎసెన్షియల్ సర్వీసెస్ (అత్యవరసర సేవలు) నిలిచిపోయినప్పుడు మాత్రమే ఎస్మా ప్రయోగించడానికి వీలుంటుందని హైకోర్టు చెప్పింది.

ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఇలాగే కొనసాగితే కష్టమని, దీన్ని పరిగణనలోకి తీసుకుని ప్రజా ప్రయోజనం కోసం ఆర్టీసీ సమ్మెను ఇల్లీగల్ అని ప్రకటించాలని కోరారు  పిటిషనర్ తరఫు న్యాయవాది. అయితే పిల్ వేసేది ప్రజాప్రయోజనం కోసమేనని తమకు తెలుసని, కానీ ఏ గ్రౌండ్ లేకుండా నిర్ణయం తీసుకోలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమ్మె ఇల్లీగల్ అనే దానిని ఎవరు ప్రకటించాలని కోర్టు అడిగింది. ట్రిబ్యునలా.. ప్రభుత్వమా.. లేక కోర్టు డిక్లేర్ చేయాలా అని ప్రశ్నించింది. ఏ చట్టం ప్రకారం సమ్మెను ఇల్లీగల్ అని ప్రకటించాలని అడిగింది. కోర్టు ఫోరమ్ కాదనీ.. కోర్టులో నిర్ణయాలు ఇష్టానుసారం తీసుకోలేమని చెప్పింది. గ్రౌండ్ లేకుండా ఆదేశాలు ఇవ్వలేమని చెప్పింది. ఆర్టీసీ.. ఎసెన్షియల్ సర్వీస్‌గా ప్రకటించారని లాయర్ కోర్టుకు గుర్తుచేశారు. అయితే కార్పొరేషన్ సర్వీసులు ఎసెన్షియల్ సర్వీస్ కిందకు రాదు అని హైకోర్టు తేల్చింది. సమ్మె ఇల్లీగల్ అని ఎవరు నిర్ణయించాలన్న దానిపై పిటిషనర్ దగ్గర సమాధానం లేదని కోర్టు చెప్పింది.  పిటిషన్ పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ఆ తర్వాత.. కార్పొరేషన్, ఎంప్లాయిస్, గవర్నమెంట్ .. ముగ్గురూ సామాన్య ప్రజల కష్టాలు పట్టించుకోకుండా కాలం గడుపుతున్నారన్న పిటిషన్ పైనా కోర్టు విచారణ జరిపింది. ఆర్టీసీ కార్మికుల జీతాల పిటిషన్ పై విచారణ గురువారానికి వాయిదా వేసింది.