ఫైర్ యాక్సిడెంట్ బాధ్యులపై..ఏం చర్యలు తీసుకున్నరు? : హైకోర్టు

ఫైర్ యాక్సిడెంట్ బాధ్యులపై..ఏం చర్యలు తీసుకున్నరు? : హైకోర్టు
  •     నాంపల్లి బజార్​ఘాట్ అగ్ని ప్రమాదం కేసులో ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు :  నాంపల్లి బజార్​ఘాట్ అగ్ని ప్రమాదం కేసులో బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్​ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.

నాంపల్లి బజార్ ఘాట్​లోని బాలాజీ రెసిడెన్సీ కింద రసాయన డ్రమ్ములు, ఇతర ముడిసరుకు నిల్వ చేసి ఉండగా విద్యుత్​ షార్ట్ సర్క్యూట్​తో గత నెల​ 13న అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు.

అనంతరం బిల్డింగ్​ఓనర్​ రమేశ్ జైస్వాల్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ అగ్నిప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అందిన లేఖను హైకోర్టు  పిల్​గా  తీసుకుంది. దీనిపై చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే అనిల్ కుమార్​తో కూడిన బెంచ్​సోమవారం విచారణ చేపట్టింది.

బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, అగ్నిమాపకశాఖ డీజీ, జీహెచ్ఎంసీ, సిటీ పోలీస్​ కమిషనర్, కలెక్టర్, నాంపల్లి జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్​కు నోటీసులు జారీ చేసింది.