
హైదరాబాద్, వెలుగు: రక్షణ శాఖ భూముల్ని కేంద్రం ఇస్తేనే రాష్ట్రం తీసుకోవాలని, అప్పటి వరకు వాటి జోలికి వెళ్లొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది. సికింద్రాబాద్‌లో బైసన్‌పోలో గ్రౌండ్ 33 ఎకరాలు, జింఖానా గ్రౌండ్ 22 ఎకరాల్లో సెక్రటేరియట్, అసెంబ్లీ, కళాభవన్‌లను నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను సవాల్ చేస్తూ రిటైర్డ్ డీజీపీ ఎంవీ భాస్కర్‌రావు తదితరులు 2017లో వేసిన పిల్స్‌ను హైకోర్టు గురువారం విచారించింది. గవర్నమెంట్ ప్లీడర్ రాథీవ్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పుడున్న సెక్రటేరియట్ ఏరియాలోనే ప్రభుత్వం కొత్త బిల్డింగ్స్ కడుతోందని, కళాభవన్, అసెంబ్లీ ప్రతిపాదనలు ఇప్పుడు అమల్లో లేవన్నారు. దీంతో పిల్‌పై విచారణ అవసరం లేదని చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిల బెంచ్ నిర్ణయించింది. పిల్‌పై విచారణను మూసేస్తున్నట్లు వెల్లడించింది. అనుమతి లేకుండా డిఫెన్స్ భూములు తీసుకోరాదని ప్రభుత్వానికి సూచించింది. అన్ని నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని, హైకోర్టుకు మాత్రం ఇవ్వడం లేదని నవ్వుతూ వ్యాఖ్య చేసింది. కొత్త జడ్జిలు వస్తున్నారని, ఇప్పుడున్న భవనం చాలడం లేదని పేర్కొంది. హైకోర్టు బిల్డింగ్ చారిత్రకమైనదని, ఇందులో నిర్మాణాలు చేయడానికి లేదని వీలు ఉండదని రాథీవ్‌రెడ్డి జవాబు చెప్పారు. వంద ఎకరాలు కేటాయిస్తే తీసుకోడానికి హైకోర్టు సుముఖత చూపలేదన్నారు. డిఫెన్స్ ల్యాండ్స్ ఇచ్చేందుకు కేంద్రం ఒప్పుకుందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు, సమ్మతి వేరని, ల్యాండ్స్ అప్పగించడం వేరని, భూములు అప్పగించే వరకు వాటి జోలికి వెళ్లకూడదని ఆదేశిస్తూ పిల్‌పై విచారణ ముగించింది.