సర్కార్‌ దవాఖానాల్లో.. సౌలతులు ఎట్లున్నయ్‌?

సర్కార్‌ దవాఖానాల్లో.. సౌలతులు ఎట్లున్నయ్‌?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లోని సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని సర్కార్​ను హైకోర్టు ఆదేశించింది. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లోని సర్కార్​ దవాఖానాల్లో  సౌకర్యాలు, కేటాయించిన బ డ్జెట్‌ వివరాలను నివేదించాలని  వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని ఎలపల్లికి చెందిన చారగొండ స్వర్ణ కాన్పు కోసం పదర మండలంలోని పుట్టింటికి వెళ్లింది. అక్కడ పురిటి నొప్పులు రావడంతో తల్లిదండ్రులు  ఆమెను108 వాహనంలో 4కిలోమీటర్ల దూరంలోని పదర పీహెచ్​సీకి తీసుకువెళ్లారు. అక్కడ సిబ్బంది పరీక్షించి 10 కిలోమీటర్ల దూరంలో అమ్రాబాద్‌ ఆస్పత్రికి పంపారు. తమ వద్ద తగిన సౌకర్యాలు లేవంటూ వారు 25 కిలోమీటర్ల దూరంలోని అచ్చంపేట ఆస్పత్రికి గర్భిణిని పంపారు. 

అనంతరం బీపీ అదుపులో లేదంటూ అక్కడి నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని నాగర్‌ కర్నూల్‌ ఆస్పత్రికి అక్కడ నుంచి వేరే కారణం చెప్పి 50 కిలోమీటర్ల దూరంలో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి నిండు గర్భిణిని తీసుకెళ్లారు. రాత్రి 2 గంటల సమయంలో డాక్టర్లు  స్వర్ణకు ప్రసవం చేశారు. కొద్దిసేపటికి  పిట్స్‌ వచ్చి తల్లి,  తరువాత శిశువు మరణించారు. మొత్తం 124 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత కూడా గర్భిణి, శిశువులను కాపాడలేకపోవడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పత్రికల్లో వచ్చిన వార్తలను పిల్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రభుత్వాసుపత్రుల్లోని సౌకర్యాలపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.