
హైదరాబాద్, వెలుగు: వరంగల్‌లో ఈ నెల 26 నుంచి 28 మధ్య జరగనున్న రైతు ర్యాలీ, బహిరంగ సభకు సంబంధించి తెలంగాణ రైతు సంఘం సమర్పించిన దరఖాస్తులను పరిశీలించి చట్టప్రకారం తగిన అనుమతులు జారీ చేయాలని వరంగల్ పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ర్యాలీ, సమావేశానికి అనుమతి కోరుతూ చేసిన దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ రైతు సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జె.శ్రీనివాసరావు విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈనెల 27 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కార్మిక మైదానం నుంచి నిర్వహించే ర్యాలీ, సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు అజంజాహి మిల్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ నిర్వహణ కోసం అనుమతి కోరుతూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించినా పోలీసులు స్పందించలేదన్నారు. వీటిపై అనుమతులు మంజూరు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కలెక్టర్ నుంచి ఎన్ఓసీ సమర్పించాల్సి ఉందని, అది లేకుండా నిర్ణయం తీసుకోలేమని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కలెక్టర్ నుంచి ఎన్ఓసీ పొంది పోలీసులకు సమర్పించాలని పిటిషనర్‌ను ఆదేశించారు. పిటిషనర్ సమర్పించిన వినతిపత్రాలను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసులను ఆదేశించారు.