- 4 వారాల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని యూపీఎస్సీ,
- రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి నియామకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రెగ్యులర్ డీజీపీ నియామకానికి సంబంధించిన ప్రక్రియను 4 వారాల్లో పూర్తిచేయాలని యూపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నియామక ప్రక్రియపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 5వ తేదీకి వాయిదా వేసింది.
ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. డీజీపీ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో సామాజిక కార్యకర్త టి.ధనగోపాల్‌రావు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ శుక్రవారం విచారణ చేపట్టారు. డీజీపీగా నియామకానికి సంబంధించి నిరుడు డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని యూపీఎస్సీని ఆదేశించారు.
కాగా, పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ డీజీపీ నియామకానికి సంబంధించి జీవోపై మధ్యంతర పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచాలని కోరారు. అయితే, ఈ అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు.
