- అభ్యంతరం ఉంటే పిటిషన్ దాఖలు చేసుకోవాలి: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. బ్యాలెట్‌లో కేటాయించిన గుర్తును సవరించాలని ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తనకు కేటాయించిన మైకు గుర్తు కింద గీత వల్ల స్పష్టత లేదని, అందువల్ల దాన్ని తొలగించి బ్యాలెట్ పేపర్‌ను తాజాగా ముద్రించాలంటూ ఈ నెల 3న ఇచ్చిన వినతిపత్రంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది నక్కా యాదీశ్వర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఎన్నికలపై అభ్యంతరం ఉంటే పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.
