కోర్టునే తప్పుదారి పట్టిస్తరా.. అట్లైతే తీవ్ర పరిణామాలుంటయ్: హైకోర్టు

కోర్టునే తప్పుదారి పట్టిస్తరా..  అట్లైతే తీవ్ర పరిణామాలుంటయ్: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు : మల్లన్నసాగర్‌ నిర్వాసితుల కోసం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం ముట్రాజ్‌పల్లిలో భూసేకరణ కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ తీరును హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఆ ప్రక్రియను పరిశీలిస్తే కోర్టును తప్పుదారి పట్టించే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రయత్నాలు చేసిన అధికారులు తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సివస్తుందని హెచ్చరించింది. 

పనులకు అనుగుణంగా డాక్యుమెంట్స్‌ రెడీ చేసి ఇస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. చేసిన పనుల్ని సమర్థించుకోవడానికి వీలుగా పేపర్లు రెడీ చేస్తే దాని పర్యావసానాలు త్రీవంగా ఉంటాయని హెచ్చరించింది. గెజిట్‌ నోటిఫికేషన్‌ గడువు పెంపు కోసం పబ్లిష్‌ చేసేందుకు ప్రింటింగ్‌ ప్రెస్‌కు రాసిన లెటర్‌ కాపీని అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీ కోసం 102 ఎకరాల సేకరణ కోసం 2021లో వెలువరించిన ప్రాథమిక నోటిషికేషన్‌ను బాలాజీ స్పిన్నర్స్‌ సవాల్‌ చేసిన పిటిషన్‌ను సింగిల్‌ జడ్జి కొట్టేశారు. 

దీనిపై దాఖలు చేసిన అప్పీల్‌ పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్‌.వి.శ్రావణ్‌ కుమార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారించింది. గతంలో గెజిట్‌ జారీకి సంబంధించి రిజిస్టర్​లో ఎంట్రీలు నమోదు చేసిన వివరాలన్ని గత ఆదేశాల మేరకు ప్రభుత్వ స్పెషల్‌ ప్లీడర్‌ సంజీవ్‌ కుమార్‌ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ప్రిలిమినరీ నోటీసు గడువు పెంచుతూ 2022 జనవరిలోని గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ 41 పబ్లిష్‌ గురించి హైకోర్టు ప్రశ్నించింది.

 ఇప్పుడు అవి అందుబాటులో లేవని, ఉంటే ఇస్తామని సంజీవ్‌కుమార్‌ చెప్పడంతో హైకోర్టు పైవిధంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది రచనారెడ్డి, గౌరారం రాజశేఖర్‌రెడ్డి వాదించారు. విచారణ వాయిదా పడింది.