ఎంపీకే సమాచారం ఇవ్వకపోతే.. సామాన్యులకేం ఇస్తరు?

ఎంపీకే సమాచారం ఇవ్వకపోతే.. సామాన్యులకేం ఇస్తరు?

రాష్ట్ర సర్కార్​పై హైకోర్టు ఫైర్ 
ఓఆర్ఆర్ టెండర్ల సమాచారం ఎందుకిస్తలేరని ప్రశ్న
రేవంత్ పిటిషన్​పై విచారణ

హైదరాబాద్, వెలుగు: ఆర్టీఐ కింద ఒక ఎంపీకే సమాచారం ఇవ్వకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని హైకోర్టు కామెంట్ చేసింది. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) టెండర్ల సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని రాష్ట్ర సర్కార్​పై ఫైర్ అయింది. ఆర్టీఐ కింద కోరినా ఓఆర్ఆర్ టెండర్ల సమాచారం ఇవ్వడం లేదని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌ రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. రేవంత్ తరఫు లాయర్ వాదిస్తూ.. ‘‘మొదట మే 1న అప్లికేషన్‌‌ పెడితే కొంత సమచారమే ఇచ్చారు. తిరిగి జూన్‌‌ 14న మరో అప్లికేషన్‌‌ పెడితే స్పందనే లేదు” అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హెచ్ఎండీఏ తరఫు లాయర్ కల్పించుకుని.. ‘‘మా వద్ద ఉన్న వివరాలు ఇచ్చాం. ఎవరైనా అడిగిన వివరాలు లేకపోతే సమాచారం లేదని చెబుతాం” అని అన్నారు. స్పందించిన కోర్టు.. ప్రజా ప్రతినిధులకే సమాచారం ఇవ్వకపోతే, సామాన్యులకేం ఇస్తారని వ్యాఖ్యానించింది. సమాచార హక్కు చట్టం ప్రాథమిక ఉద్దేశమే నీరుగారిపోతుందని తెలిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదిస్తూ.. చట్ట ప్రకారమే సమా చారం ఇస్తామన్నారు. పూర్తి వివరాలిచ్చేందుకు టైం కావాలని కోరారు. దీంతో కోర్టు విచారణను వచ్చే నెల 4కు వాయిదా వేసింది.